12 వేల వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ | Green Signal For Medical And Health Department Posts In Telangana | Sakshi
Sakshi News home page

12 వేల వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

Published Fri, Oct 9 2020 1:13 AM | Last Updated on Fri, Oct 9 2020 7:37 AM

Green Signal For Medical And Health Department Posts In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులు భర్తీ చేయడానికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు క్లియర్‌ అయ్యాయి. దీంతో వాటన్ని టినీ భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ బలోపేతంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఖాళీలను ప్రతి 6నెలలు లేదా ఏడాదికో సారి భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందువల్ల ఇక నుంచి డాక్టర్ల కొరత ఉండబోదని ఉపసంఘం స్పష్టం చేసింది. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. దీనికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షత వహించారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతుంటే, మన రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.

‘6 నెలలుగా వైద్య, ఆరోగ్యశాఖ అద్భుతంగా పనిచేసింది. ప్రజల్లో భరోసా నింపింది. వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కోవిడ్‌ సందర్భంగా ఏర్పడింది. రానున్న కాలంలో ఆయా సదుపాయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆరేళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖ అనేక విజయాలు సాధించింది. మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం మొదలు డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లు, బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి సీజనల్‌ వ్యాధులు కూడా బాగా తగ్గాయి.. వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది..’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

పేదలకే ముందుగా కరోనా వ్యాక్సిన్‌: ఈటల
వ్యాక్సిన్‌ వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఈటల మాట్లాడారు. వైద్యశాఖపై ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదిక ఇవ్వనుందని చెప్పారు. ‘సబ్‌ సెంటర్ల స్థానంలో వెల్‌నెస్‌ సెంటర్లను బలోపేతం చేస్తాం. ఆరోగ్య శ్రీ కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తుంది. మరోవైపు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కూడా ఖర్చు చేస్తుంది.

ఆరోగ్యశ్రీలోకి మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం. కిడ్నీ, హార్ట్, లివర్‌ మార్పిడి శస్త్ర చికిత్స కోసం రూ.30 లక్షల ఖర్చవుతుంది. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కింద చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికీ రూ.40 కోట్లు కొత్త బిల్డింగ్‌ కోసం కేటాయించాం. కేన్సర్‌ రోగులకు ఉచితంగా వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీపైనా సీఎంకు ఉపసంఘం ప్రత్యేక నివేదిక ఇవ్వనుంది. తెలంగాణ ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తాం. నవజాత శిశువుల మరణాల రేటు 39 నుంచి 27కి తగ్గింది. మాతృత్వపు మరణాల రేటు 92 నుంచి 63కు తగ్గింది. ఇది దేశంలోనే రికార్డు.. సీజనల్‌ వ్యాధులు తగ్గడం మిషన్‌ భగీరథ పథకం సాధించిన విజయం. మలేరియా పూర్తిగా అదుపులోకి వచ్చింది’అని ఈటల వెల్లడించారు. 

త్వరలో ప్రభుత్వ మెడికల్‌ షాపులు..
త్వరలో ప్రభుత్వ మెడికల్‌ షాపులను ఏర్పాటు చేయాలని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించాలని యోచిస్తున్నట్లు ఈటల తెలిపారు. ‘వైద్యం కోసం ఖర్చు చేయకుండా ప్రజావైద్యం అందించేందుకు పలు సూచనలను మంత్రివర్గ ఉపసంఘం చేసింది. ప్రస్తుతం 198 బస్తీ దవాఖానాలు ఉండగా, మరో 100 దవాఖానాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్స్‌ను ఏదైనా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తాం. తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో రోజుకు 10 వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. 60 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

కొత్తగా 8 డయాగ్నస్టిక్‌ హబ్స్‌ ఏర్పాటు చేసి ఇప్పుడున్న వాటితో అనుసంధానం చేస్తాం. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం మండలానికో అంబులెన్స్‌ సౌకర్యం ఉంది. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద 118, అలాగే ప్రభుత్వం 100 అంబులెన్సులు కొనుగోలు చేస్తున్నాం. మరో 20 అంబులెన్స్‌లను సీఎస్‌ఆర్‌ కింద ప్రభుత్వానికి అందాయి. మొత్తంగా 238 వాహనాలు కొత్తగా 108 సేవలను అందించనున్నాయి. పట్టణ ఆరోగ్యంపై దృష్టిపెట్టాం. పాలియేటివ్‌ కేర్‌ సెంటర్లు ఇప్పటివరకు 8 ఉన్నాయి. మరో 2 ఏర్పాటు చేస్తాం..’అని ఈటల చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement