Hanamkonda court to hear Bandi Sanjay's bail petition today - Sakshi
Sakshi News home page

టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసు: బండి సంజయ్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హన్మకొండ కోర్టు

Published Thu, Apr 6 2023 5:29 PM | Last Updated on Fri, Apr 7 2023 2:54 AM

Hanamkonda Court Verdict on Bandi Sanjay Bail Petition - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ వరంగల్‌ లీగల్‌: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు హనుమకొండ నాలుగో మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు గురువారం రాత్రి బెయిల్‌ మంజూరు చేసింది. కమలాపూర్‌ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీక్, కాపీ కుట్ర కేసులో పోలీసులు బుధవారం బండి సంజయ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్‌ తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై గురువారం సుదీర్ఘంగా విచారణ సాగింది.

పలుమార్లు వాయిదాలతో.. సుమారు 8 గంటల పాటు జరిగిన వాదోపవాదాల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి రాపోలు అనిత తీర్పు ఇచ్చారు. రూ.20 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. దేశం విడిచి వెళ్లకూడదని, కేసు విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్‌కు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను చెరిపివేయకూడదని షరతులు విధించారు. బెయిల్‌ ప్రక్రియ పూర్తయ్యేసరికి గురువారం రాత్రి అవడంతో.. బండి సంజయ్‌ శుక్రవారం ఉదయం కరీంనగర్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. 

దురుద్దేశంతో ఇరికించారు..: సంజయ్‌ లాయర్లు 
బండి సంజయ్‌ బెయిల్‌ విషయమై కోర్టులో గురువారం లంచ్‌ విరామం తర్వాత మొదలైన వాదనలు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సభ్యుడైన బండి సంజయ్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా పోలీసులతో అక్రమ కేసు బనాయించిందని ఆయన తరఫు న్యాయవాదులు శ్యాంసుందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రామకృష్ణ, సునీల్‌లు వాదించారు. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలుగానీ, ఫిర్యాదుదారు పిటిషన్‌లో ఆరోపించిన విషయాలుగానీ బండి సంజయ్‌కు వర్తించవని.. దురుద్దేశంతోనే కేసులో ఇరికించారని పేర్కొన్నారు.

ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందని, నివేదిక మాత్రమే కోర్టులో దాఖలు చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాధారాలను చెరిపేయడంగానీ చేసే ఆస్కారం లేనందున సంజయ్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఎంపీగా, సంబంధిత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. 
 
బెయిలిస్తే శాంతిభద్రతల సమస్య: పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ 
మరోవైపు సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రేవతిదేవి కోర్టును కోరారు. ‘‘తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇదే తీరుగా నేరాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. నిందితుడు బండి సంజయ్‌కు బెయిల్‌ ఇస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయనపై తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అది రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది.

అంతేగాకుండా ఈ కేసులో మరికొందరు సాక్షులను విచారించాలి. నిందితులు ముందస్తుగా కుట్రపన్ని ప్రశ్నపత్రాల లీక్, కాపీకి పాల్పడ్డారు. వారి ఫోన్‌కాల్స్, వాట్సాప్‌ చాట్‌ల వివరాలను విశ్లేషించడం ద్వారా వారి పాత్ర బయటపడింది. ఇంకా సాంకేతిక ఆధారాలు లభించాల్సి ఉంది. వాస్తవాలను వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు అవసరం. ఏ1 నిందితుడికి బెయిలిస్తే సాక్షులను బెదిరించి, దర్యాప్తునకు ఆటంకం కల్పించడంతోపాటు సాంకేతిక ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంది. సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాలి’’ అని కోరారు. 
 
బెయిల్‌ మంజూరు.. కస్టడీ పిటిషన్‌ వాయిదా 
ప్రాసిక్యూషన్, బండి సంజయ్‌ తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం గురువారం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి తీర్పు ఇచ్చారు. సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. జమానతుదారుల పూచీకత్తు పత్రాలను సంజయ్‌ తరఫు న్యాయవాదులు సమర్పించగా.. కోర్టు విడుదల ఆదేశాలు (రిలీజ్‌ ఆర్డర్‌) జారీ చేసింది. మరోవైపు సంజయ్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. 
 
శనివారం ఉదయం విడుదల 
బండి సంజయ్‌ బెయిల్‌ పేపర్లు ఇంకా మాకు అందలేదు. అందినా రాత్రి పూట విడుదల చేసే అవకాశం లేదు. శుక్రవారం ఉదయం బెయిల్‌ పేపర్లు అందే అవకాశాలు ఉన్నాయి. రాగానే వాటిని పరిశీలించి సంజయ్‌ను విడుదల చేస్తాం. 
– సమ్మయ్య, కరీంనగర్‌ జైలు సూపరింటెండెంట్‌   
చదవండి: బండి సంజయ్ చేసిన తప్పేంటి?.. అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement