సాక్షి, వరంగల్ క్రైం: న్యాయ విద్య చదువుతున్న ఓ విద్యార్థినికి తీరని అన్యాయం జరిగింది. కాసుల కక్కుర్తితో ఓ హాస్టల్ నిర్వాహకురాలు.. ఆ విద్యార్థిని జీవితంతో చెలగాటం ఆడింది. కొన్నిరోజులుగా తనకు పరిచయమున్న వారి కామవాంఛ తీర్చేందుకు బాధితురాలిని బలవంతంగా వారి వద్దకు పంపింది. ఈ వేధింపులు భరించలేని విద్యార్థిని చివరకు పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఉండటం గమనార్హం. హనుమకొండలోని ఓ ప్రైవేటు న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ నాలుగో సంవత్సరం చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థిని.. కళాశాలకు సమీపంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ ఆ విద్యార్థినిని తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్దకు కొన్నిరోజులుగా బలవంతంగా పంపుతోంది.
చదవండి: (ఆర్‌ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం)
ఈ దారుణాన్ని భరించలేని బాధితురాలు రెండు రోజుల క్రితం హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాస్టల్ నిర్వాహకురాలి మరిది, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ అయిన వేముల శివకుమార్, హనుమకొండ చౌరస్తా సమీపంలో మెడికల్ షాపు నిర్వహించే కోట విజయ్‌కుమార్ అనే వ్యక్తి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అలాగే నగరంలోని పలుచోట్లకు సైతం హాస్టల్ నిర్వాహకురాలు తనను బలవంతంగా పంపించిందని విద్యార్థిని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల కింద హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ, వేముల శివకుమార్, కోట విజయ్‌కుమార్‌లను గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment