ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఎస్సైగా పోస్టింగ్ పొందిన చోటే ఎస్పీ హోదాలో విధుల్లో చేరడం ఆనందంగా ఉందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నూతనంగా విధుల్లో చేరిన ఎస్పీతో సోమవారం ‘సాక్షి’ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. 1991లో పోలీసు శాఖలో ఎస్సైగా విధుల్లో చేరా. ఉట్నూర్ ఏరియాలో తుపాకీ భుజాన వేసుకుని అడవులను జల్లెడ పట్టా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరి పట్టా పొందా. ఉట్నూర్ పోలీసు స్టేషన్‌లో ప్రొహిబిషన్ ఎస్సైగా కడెం పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేశా. మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టి సారించి జిల్లా నుంచి వారిని తరిమివేయడంతో ప్రభుత్వం సీఐగా పదోన్నతి కల్పించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ హోదాలో జిల్లాకు వచ్చా. 18 సంవత్సరాల పాటు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది.
సాక్షి: శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారు?
ఎస్పీ: శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను సందర్శిస్తా. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటా. నేరాలు కట్టడి చేసేందుకు నిఘా సారిస్తాం.
సాక్షి: గుట్కా, మట్కా, పేకాటపై ఏవిధంగా దృష్టి సారిస్తారు?
ఎస్పీ: గుట్కా, మట్కా, పేకాట, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు చట్టపరిధిలో ఉంటే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఫోన్ ద్వారా, నేరుగా కలిసే అవకాశం కల్పించి వారి సమస్య పరిష్కారానికి కృషిచేస్తా.
చదవండి: (పోలీస్ వర్సెస్ పార్టీస్: న్యూఇయర్ వేడుకలపై ఉత్కంఠ)
సాక్షి: జిల్లాలో పనిచేసిన 18 ఏళ్లలో మీ అనుభవం ఎలా ఉంది?
ఎస్పీ: 1991లో ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సైగా విదుల్లో చేరా. మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో అటవీ ప్రాంతాలన్నీ కలియతిరిగా. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాంచంద్రాపూరం. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు సుబ్బారెడ్డి, సామ్రాజ్యం. నాతో పాటు ఓ సోదరి ఉంది. నా భార్య అరుణ. ఇద్దరు సంతానం. కుమారుడు సంతోష్, కూతురు సాధన ఉన్నారు. ఇటీవలే వీరి వివాహం జరిగింది. ఎస్సైగా ప్రారంభమైన నా జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ స్థాయికి చేరా. ఇదే నెలలో నాన్ క్యాడర్ ఐపీఎస్ హోదా రావడం సంతోషంగా ఉంది.
సాక్షి: జిల్లాలో మావోయిస్టుల కదలికలపై ఎలాంటి దృష్టి సారిస్తారు?
ఎస్పీ: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతా. గతంలో ఎస్సైగా పనిచేసిన సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాం. అందుకే ప్రభుత్వం నాకు సీఐగా పదోన్నతి సైతం కల్పించింది. ఆ అనుభవంతో జిల్లాలో వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ప్రతీ కదలికపై నిఘా పెంచుతాం.
సాక్షి: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉన్నాయా?
ఎస్పీ: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. సోమవారం నుంచి జనవరి 2వరకు ర్యాలీలు, బహిరంగసభలు నిషేధం. అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రజలు ఒకేచోట గుమిగూడి ఉండరాదు. భౌతిక దూరం పాటించాలి. వేడుకల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తాం.
సాక్షి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఎస్పీ: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలిపేలా చూస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతాం.
సాక్షి: మహిళల భద్రత, నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు చేపడతారు?
ఎస్పీ: షీ టీమ్ ద్వారా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. నేరాల అదుపునకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తాం. విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తాం. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తాం. రౌండ్ ది క్లాక్ పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం.
సాక్షి: జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చిన్నపాటి ప్రమాదాలు, నేరాలు జరిగితే సాక్ష్యం లేకుండా పోతోంది. వీటిపై మీ స్పందన ఏమిటి?
ఎస్పీ: కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపడతాం. జిల్లా కేంద్రంలో ఎక్కడెక్కడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయడం లేదనే వివరాలు సేకరిస్తాం. ఏయే ప్రాంతంలో సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయో గుర్తించి ఏర్పాటు చేస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment