సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో దళితబంధుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఈ పథకం అమలుపై సన్నాహక సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను ఆదర్శంగా తీసుకున్న కేంద్రం.. హర్‌ఘర్ జల్, కిసాన్ సమ్మాన్ యోజన వంటి వాటిని తెచ్చిందని, అలాగే దళితబంధును కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు.
నిధులు తేలేరుగానీ.. విమర్శలా..
రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్‌తోపాటు నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలకు కేంద్రం నుంచి నిధులు తేవడం చేతగాదుగానీ.. పేదల కోసం ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాత్రం వచ్చని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీలకు చేతనైతే కేంద్రాన్ని ఒప్పించి జిల్లాకొక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించాలని, ట్రైబల్, మైనింగ్ యూనివర్సిటీలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఎల్‌ఐసీ, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ సర్కారు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేస్తోందని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డిపై విమర్శలు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును కూడా హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీల కోసం పదేళ్లలో రూ.6,995 కోట్లు కేటాయిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలోనే రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 134 ఉంటే.. వాటిని 268కి పెంచామన్నారు. 53 ఎస్సీ రెసిడెన్షియల్ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేశామని వివరించారు. నిరుపేద చిన్నారులకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పించేందుకు రూ.7,280 కోట్లతో మనఊరు–మనబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉలికిపాటుపడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొండాపురం శివకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment