రజిత భర్త శంకర్ గౌడ్(కుడివైపు చివర)
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధాల మోజులో పడి.. మానవ సంబంధాలకు పాతరేస్తున్నారు కొందరు. పక్కదారి పట్టిన ఆ భార్యను.. మంచి దారిలోకి తేవాలని ఆ భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. పైగా ఒకరకంగా అదే అతని ప్రాణం మీదకు తెచ్చింది కూడా!. హయత్‌నగర్‌లో జరిగిన దారుణ ఘటన.. భార్య చేసిన కుట్ర, బాధితుడి మరణాంతరం కొన్నినెలలకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ హయత్ నగర్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో పడి.. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని ప్లాన్ చేసింది ఓ మహిళ. అందుకోసం ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తపై దాడి చేయించింది. అదృష్టం బాగుండి ఆ టైంకి బతికాడు. అనుమానం రాకుండా కన్నీళ్లు కారుస్తూ.. లేని ప్రేమను నటించిందామె. మంచానపడ్డ ఆ భర్త కొన్నాళ్లకు కన్నుమూశాడు. దీంతో తన కుట్ర బయటకు రాదని ఆమె భావించింది. అయితే.. సన్నిహితురాలి ద్వారానే ఆమె బాగోతం వెలుగులోకి వచ్చింది.
హయత్‌నగర్‌లో నివాసం ఉండే శంకర్ గౌడ్, రజితలు ఇద్దరూ ఆర్టీసీ కండక్టర్లు. శంకర్ కూకట్‌పల్లి, రజిత హయత్ నగర్ డిపో-1లో పని చేస్తుండేవాళ్లు. అయితే.. రజిత పని చేసే డిపోలోనే రాజ్‌కుమార్ ఆర్టీసీ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. శంకర్ గౌడ్ డ్యూటీ కోసం వెళ్లగానే.. రాజ్‌కుమార్ రజిత కోసం ఇంటికి వచ్చేవాడు. భార్య ప్రవర్తనలో మార్పు గమనించి.. ఆమెను మందలించాడు శంకర్. అయితే..అది ఆమెకు కోపం తెప్పించింది. భర్త లేకుంటే.. ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
.. ఈ ఏడాది మార్చి 7వ తేదీ రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న శంకర్‌పై.. దారి కాచిన రాజ్‌కుమార్, అతని ఇద్దరి స్నేహితులు దాడికి దిగారు. ఆ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడగా.. తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది రజిత. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినా.. నిందితులెవరు అనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆ దాడిలో తగిలిన దెబ్బలతో శంకర్ మంచానికే పరిమితం అయ్యాడు. అలా మూడు నెలల తర్వాత గుండెపోటుతో కన్నుమూశాడు.
అయితే.. భర్తపై దాడికి సంబంధించిన విషయాన్ని రజిత తన స్నేహితురాలితో పంచుకుంది. ఆమె అతని సోదరుడికి చెప్పడం, ఆ సోదరుడు శంకర్ గౌడ్ సోదరుడికి స్నేహితుడు కావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో శంకర్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసును తిరిగి ఓపెన్ చేసిన పోలీసులు.. రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రజితతో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమని జరిగిందంతా వివరించాడు. దీంతో.. ఐపీసీ సెక్షన్ 307గా కేసు నమోదు చేసుకుని.. రాజ్‌కుమార్, అతని సహకరించిన నీరజ్, ఉమాకాంత్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శంకర్ భార్య రజిత కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment