Mrs India Telangana Winner 2020: HansaPriya Got A Crown Of Mrs India Telangana 2020| మిసెస్‌ తెలంగాణగా హంస ప్రియ - Sakshi
Sakshi News home page

మొగులు గుబులు..

Published Wed, Oct 21 2020 1:37 AM | Last Updated on Wed, Oct 21 2020 11:10 AM

Heavy Rains In Hyderabad For Another Three Days - Sakshi

మంగళవారం కూడా ఫాక్స్‌సాగర్‌ చెరువు ముంపులోనే విలవిల్లాడుతున్న సికింద్రాబాద్‌ కొంపల్లి పరిధిలోని ఉమామహేశ్వరనగర్‌

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరాన్ని వర్షం వెంటాడుతోంది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సైతం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రెండు గంటలకోసారి మోస్తరు వర్షం పడగా సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆకాశం ముసురుపట్టి జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో ఐదు సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరిక నగరవాసులను మరింతగా బెంబేలెత్తిస్తోంది.

రోడ్లపై గుంతలు.. వీధుల్లో బురద
ఇటీవలి వర్ష బీభత్సానికి నీట మునిగిన సుమారు 200 కాలనీలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టినా 100పైగా కాల నీలు ఇంకా పూర్తిస్థాయిలో తేరుకోలేదు. వరదకు  రోడ్లు దెబ్బతిని గుంతల మయం అవగా, వీధులన్నీ బురదతో నిండిపోయాయి. వారమైనా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ఆయా కాలనీలతోపాటు చుట్టు పక్కల బస్తీలుసైతం అంధకారంలోనే మగ్గుతున్నా యి. కాలనీల ముంపు బాధితులు గత వారం రోజుల నుంచి తిండి, మంచినీళ్ల కోసం తల్లడి ల్లుతున్నారు. దీనికితోడు వరద, మురుగునీటి వల్ల ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని, దీనివల్ల అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు.

పాతబస్తీలో పొంగిన డ్రైనేజీ...
మంగళవారం కురిసిన వర్షానికి పాతబస్తీలోని దూద్‌బౌలి, ఖబూతర్‌ఖానా, హుస్సేనీఆలం, పురానాపూల్‌ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదనీరు పొంగిపొర్లింది. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తేయడంతో పురానాపూల్‌ బ్రిడ్జి వద్ద భారీ ప్రవాహం కొనసాగింది. పురానాపూల్‌ శ్మశానవాటికతోపాటు శివాలయం నీటితో నిండిపోయింది. ఒక మోస్తరు వర్షానికి బండ్ల గూడ, సన్‌సిటీ, కిస్మత్‌పూర్, బుద్వేల్, రాజేం ద్రనగర్, ఉప్పర్‌పల్లి, శివరాంపల్లి, ఆరాం ఘర్, నేషనల్‌ పోలీస్‌ అకాడమీ ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. దీనివల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చాంద్రాయణగుట్ట అల్‌జుబేల్‌ కాలనీలో మోకాళ్ల లోతు వరద నీరు నిలిచి ఉండటంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు 

ఇళ్లు ఖాళీ చేయాలని సూచన...
సరూర్‌నగర్‌లోని లోతట్టు ప్రాంత కాలనీలైన కోదండరాంనగర్, సీసాల బస్తీ, వీవీ నగర్‌ ముంపు బాధితులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే ఉన్నారు. సరూర్‌నగర్‌ చెరువులోకి ఎగువ ప్రాంతాల చెరువుల నుంచి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

పునరావాస కేంద్రాల్లో వసతులు కరువు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అవస్థలు తప్పట్లేదు. మీర్‌పేట పరిధిలో 16 పునరా వాస కేంద్రాలు ఏర్పాటు చేసినా సరైన వస తులు లేకపోవడంతో కేవలం నాలుగు కేంద్రాల్లోనే సుమారు 500 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆనంద్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో దుప్పట్లు ఇవ్వకపోవడంతో రాత్రిపూట చలికి వణికిపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాగేందుకు బోరునీటిని సరఫరా చేస్తుండటంతో గొంతు నొప్పులతో బాధపడుతున్నట్లు వాపోతున్నారు.

కూలిన పురాతన భవనాలు...
భారీ వర్షాలకు తడిసిన పురాతన కట్టడాలు నేలమట్టమవుతున్నాయి. చార్మినార్‌ సర్దార్‌మహల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలోని పురాతన ఇంటితోపాటు గౌలిపురా సాయిబాబా దేవాలయం సమీపంలోని మరో పురాతన ఇల్లు, గుడిమల్కాపూర్‌లో ఒక ఇల్లు మంగళవారం తెల్లవారుజామున కూలింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. గౌలిపురా మార్కెట్‌లో ప్రమాదకరంగా మారిన పురాతన ఇంటిని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది కూల్చేశారు. పాతబస్తీలో శిధిలావస్ధకు చేరిన సుమారు 15 పురాతన ఇళ్లను గురించి జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో 8 ఇళ్లను కూల్చేశారు. కాగా, జూబ్లీహిల్స్‌ రహమత్‌నగర్‌లోని ఓ పాఠశాల సెల్లార్‌లోకి చేరిన వరదనీటిని తొలగించే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు.

పెరుగుతున్న వరద...
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరద పోటెత్తుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హిమాయత్‌సాగర్‌ జలాశయం 1,763 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి వరదనీటిని మూసీలోకి వదిలిపెట్టారు. ఈ జలాశయంలోకి 1,200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఇక పక్కనే ఉన్న ఉస్మాన్‌సాగర్‌ గరిష్ట నీటిమట్టం 1,790 అడుగులుకాగా ప్రస్తుతం 1,786.110 అడుగుల మేర వరదనీరు చేరింది. త్వరలో ఈ జలాశయం కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement