
సాక్షి, హైదరాబాద్: జంట నగరాలపై వరుణుడి పగ చల్లారినట్టులేదు. కూడు, గూడు నీటకలిసిపోయి బిక్కుబిక్కుమంటున్న భాగ్యనగరవాసులపై వర్షం మరోసారి విరుచుకుపడుతోంది. మంగళవారం నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వాన పడుతోంది. ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్‌నగర్‌లో మోస్తరు వర్షం పడగా, హయత్‌నగర్, బేగంపేట, ఉప్పల్, మీర్‌పేటలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించింది. వరదల పరిస్థితిపై 15 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ప్రకటించారు. నగర ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని ఆయన హెచ్చరించారు. రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని తెలిపారు. చదవండి: హెచ్చరిక : ఏపీకి భారీ వర్ష సూచన
హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను ప్రభుత్వం తెప్పించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తం 53 బోట్లను హైదరాబాద్‌కు తెప్పించింది. రాష్ర్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 5 బోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. వర్షం పడుతున్న ప్రాంతాల్లో బోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది.