Telangana Rains, Large Rains Washed Away Grains In Telangana - Sakshi
Sakshi News home page

Telangana: తడిచె.. మొలకెత్తే.. 

Published Fri, Jun 4 2021 2:11 AM | Last Updated on Fri, Jun 4 2021 12:09 PM

Heavy Rains Washed Away Grains In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌:  ఈ ఏడాది దిగుబడి బాగుందన్న రైతుల సంతోషాన్ని అకాల వర్షాలు, రవాణా కష్టాలు ఆవిరి చేస్తున్నా యి. నెల రోజులుగా తరచూ కురుస్తున్న వానలతో ఇబ్బందులు నెలకొన్నాయి. ధాన్యం తడిసి రంగు మారిందని, మొలకెత్తిందని, తేమ ఎక్కువ ఉందంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు పెడ్తున్న కొర్రీలతో రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ధాన్యం తూకం వేసినా.. దానిని మిల్లులకు తరలించేందుకు లారీలు లేక మరో సమస్య ఎదురవుతోంది. కొనుగోళ్లు లేక, కొన్నా మిల్లులకు తరలించలేక.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. కాంటాలు వేసిన తర్వాత కూడా బస్తాలు మిల్లుకు చేరితేనే రైతులు ధాన్యం అమ్మినట్టు రశీదులిస్తున్నారు. అప్పటిదాకా రైతులదే బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు పడిగాపులు పడుతున్నారు. 

20 లక్షల టన్నులు ఆరుబయటే.. 
రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు ఎక్కువగా జరిగింది. సుమారు కోటీ 30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 80 లక్షల టన్నుల మేర సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 76 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా కొనుగోళ్లు సాగుతున్నాయని, అంచనా వేసుకున్న 80 లక్షల టన్నులకన్నా మరో 5లక్షల టన్నులు అధికంగా రావొచ్చని ఇటీవల పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కానీ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. ఇంకా 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం కల్లాల్లో, సేకరణ కేంద్రాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వరి సాగు ఆలస్యంగా మొదలైన ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, గద్వాల, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో ధాన్యం భారీగా ఉంది. 


నెల రోజుల నుంచి పడిగాపులే.. 
ఎకరం వరి వేశాను. 30 క్వింటాళ్ల వడ్లు వచ్చాయి. ఎండలో బాగా ఆరబెట్టి నెల రోజుల కింద కొనుగోలు కేంద్రానికి తెచి్చన. వానలకు నాలుగుసార్లు తడిసిపోయాయి. ప్రతిసారీ ఆరబెట్టుకుంటూ వచ్చిన, వారం కింద ధాన్యాన్ని కాంటా వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. అధికారులను అడిగితే లారీలు రావట్లేదని చెప్తున్నారు. ధాన్యం మిల్లుకు చేరేదాకా మా బాధ్యతే అంటున్నారు. కొద్దిరోజులుగా వానలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ చూసుకోవాల్సి వస్తోంది. 
– కాలసాని వెంకటరెడ్డి, రైతు, కురవి, మహబూబాబాద్‌ జిల్లా 


ఎక్కడ చూసినా అదే పరిస్థితి..
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి మొత్తం 306 కొనుగోలు కేంద్రాలను తెరిచారు. నాలుగున్నర లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 2 వరకు కూడా 3,17,520 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇంకా భారీగా ధాన్యం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలన్నర రోజులు అవుతున్నా.. తూకం వేయక, వేసినా మిల్లులకు తరలించక రైతులు ఇబ్బంది పడుతున్నారు.  

మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఈ నెల 2వ తేదీ నాటికి 42 వేల బస్తాల ధాన్యంరాగా.. 32,588 బస్తాలు కాంటా అయింది. ఇందులో 19,315 బస్తాలు మాత్రమే మిల్లులకు పంపగలిగారు. అంటే తూకం వేసిన ధాన్యమే 13,273 బస్తాలు ఉండగా.. తూకం వేయనిది మరో 9,500 బస్తాల వరకు ఉంటుం దని అధికారులే చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.


ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నామ శ్రీను. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామం. మూడెకరాల్లో వరి వేస్తే 200 బస్తాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్‌లోనే గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ధాన్యం రాశిపై పట్టా కప్పి పెట్టాడు. రెండు నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ‘‘ఇప్పటికే పలుమార్లు ధాన్యం తడిసింది. కొంత మేర మొలకలు వచ్చింది. గురువారం మళ్లీ తడిసిపోయింది. ఇప్పుడీ ధాన్యాన్ని కొంటారా లేదా తెలియడం లేదు. వానాకాలం సీజన్‌ మొదలైంది. వ్యవసాయ పనులు చేసుకోవాలి. ధాన్యం అమ్మితే తప్ప పెట్టుబడికి డబ్బులు లేవు. త్వరగా ధాన్యం కొంటే మా కష్టాలు తీరు
తాయి..’’ అని శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


వానలకు తడవడంతో ధాన్యం బస్తాల నుంచి వచ్చిన మొలకలివి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన రైతు కాటం రమేశ్‌.. 45 రోజుల కింద మండల కేంద్రం లోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. 10 రోజుల కింద 150 బస్తాలు తూకం వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో ధాన్యం తడిసి మొలకెత్తింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసినా మిల్లులకు తరలించేదాకా రైతులదే బాధ్యత అని చెప్పారు. మిల్లులు మొలకెత్తిన ధాన్యం తీసుకుంటారా లేదా అన్నది అనుమానమేనని.. ఎంత తరుగు తీస్తారో అర్థం కావడం లేదని రమేశ్‌ ఆందోళన చెందుతున్నారు. 


ఈ ఫొటోలోని రైతు బత్తుల బాలయ్య. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్షి్మపురం. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో 224 బస్తాల ధాన్యం తూకం వేసి నెలన్నర దాటింది. మిల్లుకు తరలించడానికి లారీలు రాకపోవడంతో రోజూ ధాన్యం వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. వానలకు ధాన్యం తడుస్తోంది. చీడపీడల నుంచి కాపాడుకున్న పంట చివరకు ఇలా ఆగమవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  


వాన.. దెబ్బకొట్టింది 
వాన పడిన ప్రతిసారీ ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో నీళ్లు నిలుస్తుండటంతో.. ధాన్యం రాశుల అడుగున మొలకలు వస్తున్నాయి. ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉంటోంది. తేమ శాతం తగ్గేందుకు ధాన్యాన్ని ఆరబెడితే.. మళ్లీ వానలు కురిసి తడిసిపోతోంది. 

మార్కెట్‌.. కడుపుకొట్టింది 
రైతులు ధాన్యాన్ని తీసుకెళ్తే తేమ ఎక్కువగా ఉందని, రంగు మారిందని చెప్తూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రోజులకు రోజులు అక్కడే ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ తూకం వేసినా మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వేధిస్తోంది. లారీ దొరికి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లినా తేమ, రంగు, తాలు అంటూ కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు. తీసుకుంటే.. బస్తాకు కిలో నుంచి మూడు కిలోల దాకా కోత పెడుతున్నారు. 

చివరికి.. మట్టి మిగిలింది 
వానలకు కొట్టుకుపోయి, ఆరబెట్టి ఎత్తినప్పుడల్లా కొంత ధాన్యం పోతోంది. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో ఏదో ఓ కారణం చెప్పి కోత పెడుతుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఇంతా జరిగి సొమ్ము చేతికొచ్చేసరికి జాప్యం జరుగుతోంది. ఆలోగా పెట్టుబడికోసం చేసిన అప్పులపై మిత్తీలు పెరిగిపోతున్నాయి. చివరికి రైతుకు మట్టే మిగులుతోంది. 

ఇన్నితిప్పలు ఎప్పుడూ పడలే...
నాలుగెకరాల్లో వరి వేసిన. కోతలు అయినంక నెలన్నర కిందనే ఊరిలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచి్చన. 15 రోజుల కిందనే కాంటా వేశారు. లారీలు లేవని మిల్లుకు పంపడం లేదు. వానలతో ధాన్యం తడిచిపోతూనే ఉంది. బస్తాల్లో కింది నుంచి మొలకెత్తుతోంది. ధాన్యం మిల్లుకు చేరితేనే కొనుగోలు చేసినట్టు రసీదు ఇస్తున్నరు. ఇట్లా మిల్లుకు వెళ్తే ఒక్కో బస్తాకు ఎంత తరుగు తీస్తారో. ఇన్ని తిప్పలు ఎప్పుడూ పడలే..    – ఈర్ల కాటయ్య, ముత్యాలగూడెం, ఖమ్మం జిల్లా 


ఎన్నడూ లేనంతగా ధాన్యం కొన్నాం.. 
ఈసారి ధాన్యం కొనుగోలు లక్ష్యం 80 లక్షల టన్నులైతే.. ఇప్పటికే 76 లక్షల టన్నులు సేకరించాం. లక్ష్యానికి మించి 85 లక్షల టన్నుల వరకు సేకరించేందుకూ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ. వెయ్యి కోట్ల రుణం కోసం బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఎన్నడూ లేనట్టు రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నాం.
– మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement