
భువనగిరిలో తవ్వకాల్లో బయటపడ్డ దేవాలయ స్తంభాలు, యాలీ పిల్లర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం చారిత్రక సంపద వెలుగు చూసింది. పట్టణంలోని ఖిలా కందకం వద్ద అభివృద్ధి పనుల కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన కాలంనాటి దేవాలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. పదిరోజులుగా కందకం వద్ద ఉన్న మట్టికుప్పలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కందకం ప్రాంతంలో ఉన్న మట్టిదిబ్బలను చదును చేసి పార్క్‌గా అభివృద్ధి చేయడానికి సంకల్పించి, అందులో భాగంగా పనులు చేపట్టారు.
అయితే ఇప్పటికే గాంధీనగర్‌లో మురికికాలువ కోసం జరిపిన తవ్వకాల్లో సంస్కృత లిపి ఉన్న శిలాశాసనం బయటపడింది. కందకం పక్కన గల కోటగడ్డ కింద దేవాలయాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు జరిపిన కోటగడ్డ తవ్వకాల్లో బైరవుడి విగ్రహం బయటపడింది. ప్రస్తుతం తవ్వకాల్లో బయటపడ్డ స్తంభాలు, యాలీ పిల్లర్లు రాష్ట్ర కూటులు, కల్యాణ చాళుక్యుల రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకుడు శ్రీ రామోజు హరగోపాల్ అంటున్నారు.
కోటగడ్డ కింద దేవాలయాల సముదాయం ఉంటుందని భావిస్తున్నారు. కందకం వద్ద బయటపడ్డ పిల్లర్ల అనవాళ్ల ప్రకారం ఇక్కడ త్రికూటాలయం, లేక ఏక కూట ఆలయం ఉంటుందని హరగోపాల్ అన్నారు. ఇది 16 లేదా అంతకంటే ఎక్కువ రాతి పిల్లర్లతో నిర్మించిన అర్ధమంటపమై ఉంటుందని చెప్పారు. భువనగిరి కుమ్మరివాడలో గతంలో సింహయాలీ పిల్లర్‌కు చెందిన ముక్క దొరికిందని చెప్పారు.
బ్రాహ్మణ వాడ, కుమ్మరివాడ మొదలు ఈ ప్రాంతంలో కోటగడ్డ కింద ఉన్న చారిత్రక సంపదను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని పనులు నిలిపివేశారు. ఈ మేరకు ఆర్కియాలజీ, రెవెన్యూ శాఖలకు సమాచారం ఇచ్చినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఆయా శాఖల అధికారులు వచ్చి పరిశీలిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment