సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడంతో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా చిన్న చిట్కాలతో కరోనాను చిత్తు చేశారు. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగాతోపాటు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేసి శ్వాస సంబంధ సమస్యలు అధిగమించారు.
కుటుంబసభ్యులు, బంధువులతో వీడియో కాలింగ్, ఛాటింగ్ చేస్తూ ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఆనందంగా గడిపారు. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవల్స్ తగ్గకుండా చూసుకున్నారు. వేడినీళ్లు మాత్రమే తాగుతూ, ఉప్పు, పసుపు వేసిన నీటిని గొంతులో పోసుకుని గార్గిల్ చేస్తూ, రెండు పూటలా ఆవిరిపట్టారు. గదిలో ఒంటరిగా ఉన్నామనే భావన మనసులోకి రానీయకుండా, ఒత్తిడి కలిగించే అంశాలను ఆలోచించకుండా, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో క్వారంటైన్‌ను మామూలు రోజుల్లాగే కామన్‌గా గడిపారు. గడువు ముగిసిన తర్వాత నిర్వహించిన వైద్యపరీక్షల్లో నెగిటివ్ రావడంతో కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. హోంఐసోలేషన్‌లో ఉంటూ కరోనాపై విజయం సాధించిన పలువురు సలహాలు, సూచనలతోపాటు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
ధైర్యమే బతికించింది
నా వయసు 65 ఏళ్లు.. మాది ఉమ్మడి కుటుంబం. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో జాయిన్ చేస్తామంటే వద్దని, హోంఐసోలేషన్‌లో ఉంటానని చెప్పాను. తర్వాత కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. నలుగురం కలిసి అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉన్నాం. పల్స్ ఆక్సిమీటర్ తెప్పించుకున్నా. ప్రతిరోజు ఉదయం ప్రాణాయామం, యోగా సాధన. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వీడియో కాలింగ్, చాటింగ్ చేసుకుంటూ ఆనందంగా గడిపాను. 14 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగిటివ్ వచ్చింది.
– మణెమ్మ, శ్రీనివాసనగర్, సీతాఫల్‌మండి
భయాందోళన వద్దు
కరోనా పాజిటివ్ వస్తే భయాందోళన వద్దు. గతనెల 5వ తేదీన నాకు, మానాన్న నర్సింగ్‌రావుకు ఒకేరోజు జ్వరం వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకున్నాక జ్వరం తగ్గింది. వైద్యుల సూచన మేరకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. హోంక్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా నాన్న అందించిన ధైర్యంతో భయాన్ని పోగొట్టింది. ఆవిరి పట్టడం, కషాయం తాగడం, పోషకాహారం తినడంతోపాటు మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతం, పాటలు వింటూ ఆనందంగా గడిపాం. అమ్మ సహకారంతో హోంక్వారంటైన్ పూర్తిచేశాం. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.
– లక్ష్మీప్రియ, ప్రైవేటు ఎంప్లాయి, న్యూబోయిగూడ
జాగ్రత్తలు పాటించా..
నేను కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో నాల్గవ తరగతి కాంట్రాక్ట్ ఉద్యోగిని. కరోనా బాధితుల మధ్యే సేవలు అందిస్తుంటాను. ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురికావడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంట్లో భార్యతోపాటు ముగ్గురు చిన్నపిల్లలు, వృద్ధురాలైన అమ్మ ఉన్నారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఇతర వైద్యులు ఆస్పత్రిలో బాధితులకు ఇచ్చే కౌన్సిలింగ్ గుర్తుకు వచ్చింది. అవసరమైతేనే ఆస్పత్రికి రావాలి. జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గిపోతుంది. ఆ మాటలు గుర్తొచ్చి 14 రోజులు హోంక్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పుడు కరోనా నెగిటివ్ వచి్చంది.
– గణపతి, గాంధీఆస్పత్రి స్టాఫ్
మెదడులో హార్మోన్ల సంఖ్య తగ్గి..
తీవ్రమైన భయాందోళనకు గురికావడం వల్లే కరోనా మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒత్తిడి పెంచే అంశాలు వలన మెదడులోని హార్మోన్ల సంఖ్య తగ్గి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయవు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మవద్దు. ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా తగ్గుతుందని వీడియోను చూసిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా బాధితులు మధుర క్షణాలను మాత్రమే గుర్తుచేసుకుని ఆనందంగా ఉండాలి. గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ వందలాది మంది బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఆలోచన విధానంలో మార్పు తెచ్చి స్వస్థత చేకూర్చేందుకు కృషి చేస్తున్నాం.
– జూపాక అజయ్‌కుమార్, సైకియాట్రిస్ట్
( చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే: సీఎస్ )
Comments
Please login to add a commentAdd a comment