
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసి, ఇప్పటికే డ్రైరన్ కూడా పూర్తి చేసింది. వ్యాక్సిన్ పంపిణీలో వృధాను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన లబ్ధిదారుల నిష్పత్తి (1.19 లక్షల)కి అదనంగా పది శాతం (1.30 లక్షలు)డోసుల వ్యాక్సిన్‌ను కేటాయించింది. ఈ వ్యాక్సిన్ మంగళవారం సాయంత్రంలోగా నగరానికి చేరుకునే అవకాశం ఉంది. గ్రేటర్‌లో తొలిరోజు 33 ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నారు. గాంధీ సహా రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగ్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే వ్యాక్సినేషన్‌లో పాల్గొనే సిబ్బంది, వ్యాక్సిన్ వేయించుకున్న లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ ఆన్‌లైన్ వేదికగా మాటామంతీ కలిపే అవకాశం ఉంది. తొలిరోజు మూడు వేల మందికిపైగా లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేయనున్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. బయల్దేరిన ‘కోవిషీల్డ్’
హైదరాబాద్ జిల్లాలో...
హైదరాబాద్ జిల్లాలో 78236 మంది హెల్త్ వర్కర్లు ఉన్నట్లు గుర్తించి, వారి పేరు, ఫోన్ నెంబర్ సహా పూర్తి వివరాలను ఇప్పటికే కోవిన్ పోర్టల్‌లో నమోదు చేశారు. గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఆమాన్‌నగర్, పాల్‌దాస్, తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలు, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి సహా సోమాజిగూడ యశోద, జూబ్లీహిల్స్ అపోలో, సికింద్రాబాద్ కిమ్స్, బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో, స్టార్, ఫెర్నాండెజ్ ఆస్పత్రుల్లో ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత 18వ తేదీ నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..
రంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో ఇప్పటికే 26078 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, వారి వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. జిల్లాలో 42 స్టోరేజీ పాయింట్లను గుర్తించారు. 150 సెంటర్లలో వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ నెల 16న జిల్లాలోని నార్సింగ్ యూపీహెచ్‌సీ, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్), గచ్చిబౌలిలోని ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాంటినెంటల్ ఆస్పత్రి, చందానగర్‌లోని పీఆర్‌కే ఆస్పత్రి, మాదాపూర్‌లోని మెడికవర్, గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని నార్సింగ్ పట్టణ ఆరోగ్య కేంద్రంలోని లబ్ధిదారులు, సిబ్బందితో ప్రధాని మోదీ ఆన్‌లైన్ వేదికగా మాటామంతీ కలుపనున్నారు.
మేడ్చల్ జిల్లాలో..
మేడ్చల్ జిల్లాలో 14702 మంది లబ్ధిదారులను గుర్తించారు. 17 వ్యాక్సిన్ స్టోరేజీ పాయింట్లను ఎంపిక చేశారు. 59 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయనున్నారు. తొలి రోజున అంకుర ఆస్పత్రి, కుషాయిగూడ పీహెచ్‌సీ, మల్లారెడ్డి ఆస్పత్రి, మల్లాపూర్ పీహెచ్‌సీ, మ్యాట్రిక్స్, మెడిసిటీ, ఓమ్నీ, రెమిడీ, శ్రీశ్రీహోలిస్టిక్, ఉప్పల్ పీహెచ్ సీల్లో వ్యాక్సిన్ వేయనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో డోసులో 0.5 మి.లీ వ్యాక్సిన్ వేయనున్నారు. 28 రోజుల తర్వాత రెండో డోసు వేయనున్నారు. ఇలా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
వారంలో ఆ నాలుగు రోజులే..
ప్రస్తుతం బుధ, శని వారాల్లో రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ఆయా రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేస్తే. .రెగ్యులర్ వ్యాక్సినేషన్‌కు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రెండు రోజులతో పాటు పబ్లిక్ హాలీడే అయిన ఆదివారం మినహా మిగిలిన సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయనున్నా రు. దీనికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో విడతలో ప్రంట్‌లైన్ వారియర్స్(పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులు)కు వ్యాక్సిన్ వేయనున్నారు. మూడో విడతలో 50 ఏళ్లు దాటిన వృద్ధులు, కేన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, హార్ట్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడు తున్న బాధితులు, ఇతర రోగ నిరోధ కశక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఆ తర్వాత నాలుగో విడతలో సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment