ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా నగర ఫిట్‌నెస్ రంగం రూపు రేఖలు మార్చేస్తోంది. వ్యాయామ ప్రియులలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ శిక్షకులు, జిమ్ నిర్వాహకులను కొత్త రూట్ పట్టిస్తోంది. ఓ వైపు జిమ్ సెంటర్లను మూత పడేలా చేస్తూనే మరోవైపు శిక్షకులలో మాత్రం జోష్ నింపుతోంది.
సాక్షి, సిటీబ్యూరో
కరోనా మహమ్మారి దెబ్బకు అమాంతం కుప్పకూలిన సిటీ ఫిట్‌నెస్ రంగం.. లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా పూర్తిగా కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ రంగంలో కొత్త కొత్త మార్పులు రావడానికి కరోనా బాటలు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. చదవండి: సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు..
జిమ్స్ ‘లాక్’...
నగరంలో ఏడాదికి ముందు కనిపించిన జిమ్స్ సందడి ఇప్పుడు కానరావడం లేదు. ఏడాది క్రితం వరకూ నగరంలో రోజుకో జిమ్, నెలకో ఫిట్‌నెస్ సెంటర్ అన్నట్టుగా ప్రారంభాలు జరుగుతుండేవి. ఇప్పుడు అది తిరగబడింది. ఎటు చూసినా జిమ్/పిట్‌నెస్ సెంటర్ల మూసివేతే కనపడుతోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ఓ బ్రాండెడ్ జిమ్ కంపెనీ నగరంలోని తమ అన్ని శాఖలనూ మూసివేసింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా బ్యాంకు రుణాలు చెల్లించలేని పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న 200 హెల్త్ క్లబ్స్‌తో పాటు సిటీలో కూడా క్లోజ్ చేసేసింది.
జూబ్లీహిల్స్‌లోని బీట్స్ జిమ్ మూతపడింది.
రోడ్ నెం 36లోని చట్నీస్ హోటల్ ఎదురుంగా ఉండే మరో ఫేమస్ జిమ్, దేశవ్యాప్తంగా బ్రాంచిలు నిర్వహిస్తూ నాలుగేళ్ల క్రితం నగరంలోనూ ఏర్పాటైన మరో జిమ్, 24గంటలూ సేవలందిస్తానంటూ అందుబాటులోకి వచ్చిన మరో అత్యాధునిక హెల్త్ క్లబ్ ఇంకా అనేక బ్రాండెడ్ ఫిట్‌నెస్ సెంటర్లు తీవ్రమైన నష్టాలతో నడుస్తున్నాయి. ఇప్పటికే ఇవి బ్యాంకు రుణాల విషయంలో కేసులు ఎదుర్కొంటున్నాయి.
ట్రైనర్స్ ఖుష్...
కరోనా కారణంగా ఫిట్‌నెస్ ఇండస్ట్రీ కుదేలైనప్పటికీ జిమ్‌లో సభ్యులకు వర్కవుట్ శిక్షణ అందించే ట్రైనర్స్‌కు మాత్రం కలిసి వచ్చింది. లాక్ డౌన్ తర్వాత చాలా మంది ట్రైనర్లకు పర్సనల్ ట్రైనింగ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. కస్టమర్ల ఇళ్లకు వెళ్లి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా జిమ్‌లో నెలవారీ జీతానికి కనీసం ఐదు నుంచి పది రెట్లు ఆదాయం, దానితో పాటే ఎవరి దగ్గరా పనిచేసే అవసరం లేకపోవడం వంటి లాభాలు కలుగుతుండడంతో అనుభవజ్ఞులైన ట్రైనర్లకు కరోనా పరోక్షంగా మేలు చేసిందనాలి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత జిమ్‌లు తెరుచుకున్నా... పలువురు ట్రైనర్లు తమ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పేశారు. అంతేకాకుండా జిమ్స్‌లో శిక్షణ అందించేటప్పుడు పలువురు మెంబర్స్‌తో ఏర్పడిన ఫ్రెండ్‌షిప్ తో వారికి పర్సనల్ ట్రైనర్లుగా అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఈ కారణంగా జిమ్స్‌కు అటు మెంబర్స్‌తో పాటు ఇటు ట్రైనర్స్ కూడా తగ్గిపోయారు.
పరికరాల బిజినెస్ జోష్...
డంబెల్స్, బెంచ్‌ప్రెస్, ట్రెడ్ మిల్, బార్‌రాడ్స్...వగైరా ఎక్విప్‌మెంట్ వ్యాపారానికి కరోనా ఊపునిచ్చింది. ఎన్నడూ లేనంతగా హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి సిటిజనులు ఆసక్తి చూపించడంతో జిమ్ ఎక్విప్‌మెంట్ వ్యాపారం ఊపందుకుంది. ముఖ్యంగా ట్రెడ్‌మిల్, వర్కవుట్ సైకిల్స్ బాగా సేల్ అయ్యాయని నగరానికి చెందిన ఓ ఎక్విప్‌మెంట్ సంస్థ ప్రతినిధి చెప్పారు.
నెట్..వర్కవుట్...
ఇంట్లోనే వ్యాయామాలు చేయడానికి నగరవాసులు అలవాటుపడుతూ వర్కవుట్ గురించి తెలుసుకోవడానికి యూ ట్యూబ్ లో వీడియోలను వీక్షిస్తున్నారు. యోగా, ఎరోబిక్స్, జుంబా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, బాడీ వెయిట్ వర్కవుట్స్... వంటివి చేసే విధానాల గురించి తెలుగులో తెలియజెప్పే వీడియోలకు డిమాండ్ పెరిగింది. దీంతో నగరానికి చెందిన పలువురు జిమ్ ట్రైనర్లు యూ ట్యూబ్ చానెల్స్ ప్రారంభించారు. చిన్న, మధ్య తరహా జిమ్స్ పడుతూ లేస్తూ నడుస్తున్నప్పటికీ..మొత్తం మీద వ్యాపార పరంగా చూస్తే మాత్రం ఫిట్‌నెస్ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందనేది నిర్వివాదం. అయితే ఇది రూ.కోట్ల టర్నోవర్ చేసే సంస్థలకే ఎక్కువ నష్టాలు తెచ్చి పెట్టింది. ఆరోగ్యార్థుల్లో అవగాహన పెరగడం, హోమ్ జిమ్స్ పట్ల ఆసక్తి వంటి మంచి మార్పులకూ కరోనా దోహదం చేసింది. ఈ నష్టాల నుంచి కోలుకుని మరో ఏడాదిలోపే ఫిట్‌నెస్ ఇండస్ట్రీ పూర్వవైభవం సంతరించుకోడం తథ్యమని ఫిట్ నెస్ ట్రైనర్ విజయ్ గంధం ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment