ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్ర రాజధానిలో విలయతాండవం చేస్తోన్న కరోనా మహమ్మారి ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టింది. ఇప్పటికే హైదరాబాద్, శివారు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తోన్న సుమారు వంద మంది ఉద్యోగులను పొట్టనబెట్టుకుంది. ఈ వైరస్ సోకి చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు వెయ్యి మందికి పైనే ఉన్నారు. ఒక్క హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలోనే 70 మందికి వైరస్ సోకింది. సర్కిళ్ల పరిధిలో మరో 250 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటు హైదరాబాద్ డీఆర్వో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోన్న నాల్గో తరగతి ఉద్యోగులు ఇద్దరు కరోనాతో కన్నుమూశారు.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం ఒకటో రెండో మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 20 మంది కరోనాకు బలయ్యారు. భౌతిక దూరం పాటించినా, మాస్కులు ధరించినా, శానిటైజర్ వాడినా ఫలితంలేకుండా పోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రస్తుతం 1.17 లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మరో 40 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నా పాజిటివ్ కేసులకు మాత్రం బ్రేక్ పడడం లేదు. పెరుగుతోన్న కేసులతో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు జంకుతున్నారు.
ఆన్‌లైన్లోనే అర్జీలు.. అయినా..
వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలను సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో గ్రీవెన్స్ డే (ప్రజావాణి)ను నిలిపివేసిన ప్రభుత్వం..ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తోంది. అయినా చాలా మంది ఫిర్యాదుదారులు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారి కోసం కలెక్టరేట్‌లో దర ఖాస్తుల పెట్టె సైతం ఏర్పాటు చేశారు. అయినా సంబంధిత అధికారులను కలవందే వెళ్లడం లేదు. ఇలా వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ ఉన్న వాళ్లూ ఉండడంతో వారి ద్వారా కేసులు ప్రబలుతున్నాయంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో కొద్ది రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అర్జీదారులకు బ్రేక్ పడింది.
చదవండి: ఔరా! వీళ్లంతా అత్యవసర సర్వీసులకేనా!
ఎందరో...
సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న బ్లాండినా (57) వారం రోజుల క్రితం కరోనా బారినపడింది. చికిత్స నిమిత్తం కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ఈ నెల 20న మృతి చెందారు. హైదరాబాద్‌లో టీఎస్‌ఎండీసీ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దీప్తి ఈ నెల 19న కరోనాతో చనిపోయారు. ఇటీవల ఆమె తల్లి జానకమ్మ సైతం కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస వదిలారు. కూకట్‌పల్లి విద్యుత్ శాఖ డీఈగా విధులు నిర్వర్తిస్తున్న వి.జోసఫ్‌కు కరోనా సోకింది. పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యంపై బెంగపెట్టుకున్నారు. ఈ నెల 16న కన్నుమూశారు. ఈ నెల 4న..అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తు న్న కందుకూరు మండలం దెబ్బడగూడకు చెందిన అమరవాది నర్సింహ కరోనాతో కన్నుమూశారు.
షాద్‌నగర్ మండలం రామేశ్వరం, రంగంపల్లి గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోన్న మణికంఠ (26)ను కరోనా ఇటీవల బలిగొంది.
∙మహేశ్వరం, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన పంచాయతీ కార్యదర్శులు ముగ్గురూ ఇటీవల కరోనాతో చనిపోయారు. కేవలం వీరే కాదూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివిధ శాఖలకు చెందిన సుమారు వంద మంది ఉద్యోగులను కరోనా కాటేసింది. దూడం వెంకట నర్సింహరాజు (55) తెలంగాణ సచివాలయంలోని ఓ విభాగంలో అసెస్టింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా లక్షణాలతో నగరంలో టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 11న చనిపోయారు.
విధుల్లో మూడో వంతు సిబ్బంది
కరోనా ఎఫెక్ట్‌తో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూడో వంతు సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది కోవిడ్ సేవల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తోంది. దీంతో ఈ శాఖల ఉద్యోగులు, సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఏ క్షణాన ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని వారంతా ఆందోళనలో ఉన్నారు. నగరంలోని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి దాదాపు 4,585 మంది ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు.
ఇందులో మేడ్చల్ జిల్లాలో 1,460 మంది, రంగారెడ్డిలో 1,950, హైదరాబాద్‌లో 1,175 మంది ఉన్నారు. కొన్ని శాఖలు తప్ప మిగతా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో మూడోవంతు సిబ్బంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. 33 శాతం వంతున ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పని చేయటం వల్ల వారానికి రెండు రోజులు మాత్రమే విధుల్లో పాల్గొంటూ...కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులు, ఉద్యో గులు సిబ్బంది మొత్తం.. కోవిడ్ టెస్టులు, వ్యాక్సినేషన్, ఇంటింటి ఫీవర్ సర్వే, సాధారణ రోగులకు వైద్య సేవల్లో నిమగ్నమయ్యారు.
ఆర్థిక సాయం అందించాలి
పెరుగుతోన్న కరోనా కేసుల దృష్యా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. విధిగా మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్ వాడాలి. పనుల నిమిత్తం వచ్చే దరఖాస్తుదారులు, సహచర ఉద్యోగులతో భౌతిక దూరం పాటించాలి. సెకండ్ వేవ్‌లో రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 20 మంది రెవెన్యూ ఉద్యోగులు మృతి చెందారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి.
– కె.లక్ష్మణ్, టీఎన్‌జీవో, అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment