సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఒకరికి ఒక ట్రాఫిక్ పోలీసు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేసి అతని ప్రాణాలను కాపాడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత ట్రాఫిక్ పోలీసును అభినందించారు. అంతేకాదు.. ఇలాంటి ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల ప్రాణాలు కాపాడటంపై దృష్టి సారించారు.
వచ్చే వారం నుంచి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాలు, జిమ్‌లలో ఎంపిక చేసినవారికి, 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు అందరికీ సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా గుండె ఆగి (సడన్ కార్డియాక్ అరెస్ట్) చనిపోతున్న సంఘటనలు పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఏటా గుండె సంబంధిత వ్యాధులతో రెండున్నర లక్షల మంది చనిపోతున్నారు. వీటిల్లో సడన్ కార్డియాక్ అరెస్టు కేసులు కూడా ఉన్నాయి. గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే ఇలాంటివి సంభవించేవి. కానీ ఇప్పుడు యువతీయువకుల్లోనూ సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
గుండె అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోతుంది?
ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడటం, గుండె కండరం దళసరిగా ఉండటం, కుటుంబీకులకు ఈ రకమైన చరిత్ర ఉండటం, ఒత్తిడి వంటి ఏదో ఒక కారణంతో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే గుండె మొత్తం ఒకేసారి పని చేయడం ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలొదులుతారు.
జంక్ ఫుడ్, స్థూలకాయం, ధూమపానం, మితిమీరిన మద్యపానం, మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం కారణంగా ఎలాంటి గుండె వ్యాధి లేనివారు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ బారినపడుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తే కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడే అవకాశం
ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్న వారు వెంటనే సీపీఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ సులభంగా చేసేందుకు వీలున్న టెక్నిక్. కానీ అదేమిటో, ఎలా చేయాలో ఏ కొద్దిమందికో తప్ప చాలామందికి తెలియకపోవడం వల్ల బాధితులు కళ్లెదుటే చనిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది.
బాధితుల్లో 2 నుంచి 5 శాతం మందికే మన దేశంలో సీపీఆర్ అందుతోంది. సీపీఆర్ చేస్తే ఐదుగురిలో ఒకరు బతుకుతారు. మన దేశంలో పెద్ద ఆసుపత్రుల్లో తప్ప చిన్న ఆసుపత్రుల్లోని సిబ్బందికి కూడా సీపీఆర్‌పై సరైన శిక్షణ లేకపోవడం గమనార్హం. తెలంగాణలో 933 పీహెచ్‌సీలు ఉన్నాయి. అలాగే అనేకచోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నా చాలామంది నర్సులు, ఇతర సిబ్బందికి సీపీఆర్ చేయడం తెలియదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీపీఆర్ అంటే..
ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలిపోతే వెంటనే సమీపంలో ఉన్నవారు రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కాలి. అలా 20–30 సార్లు చేయాలి. తర్వాత రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గట్టిగా గాలి ఊదాలి. ఇలా రెండుమూడు సార్లు చేయాలి. దీన్నే సీపీఆర్ అంటారు. ఇలా చేయడంపై శిక్షణ ఇవ్వాలనే ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. సీపీఆర్ వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడే వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment