సాక్షి, హైదరాబాద్: ‘నగరంలోని ప్రతీ ఒక్కరి జీవితంపై నేరుగా ప్రభావితం చూపే అంశం ట్రాఫిక్. ఇది సజావుగా సాగేలా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారం, సమన్వయం ఉంటే పూర్తి సాయి ఫలితాలు ఉంటాయి’ అని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న ఏడాది కాలానికి సిద్ధం చేసుకున్న ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్‌పై గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్వాల్ ఏం చెప్పారంటే..
క్యారేజ్ వే క్లియరెన్స్ కోసం ‘రోప్’...
రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగాలంటే ఫుట్‌పాత్‌కు– ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్ వే క్లియర్‌గా ఉండాలి. ప్రస్తుతం ప్రధాన రహదారులు సహా అనేక చోట్ల అక్రమ పార్కింగ్, ఆక్రమణలతో క్యారేజ్ వే కనిపించట్లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆపరేషన్ రోప్ (రివూవల్ ఆఫ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌కరోజ్‌మెంట్స్) చేపడుతున్నాం. ఇందులో భాగంగా అదనపు క్రేన్లు సమకూర్చుకుని టోవింగ్ చేయడంతో పాటు అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలకు క్లాంప్స్ వేస్తాం. వాహన చోదకుడికి ఇబ్బంది లేకుండా వాటిపై స్థానిక అధికారుల ఫోన్ నంబర్లు ఉంచుతాం. తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణలనూ పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్స్ సహా ప్రతి భవనానికీ పార్కింగ్ ఉండేలా చూస్తాం. ఆర్టీసీ సహకారంతో బస్ బేల పునరుద్ధరణ, ఆటో స్టాండ్లు పూర్తి స్థాయి వినియోగంలోకి తేస్తాం.
చదవండి: ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు!
పీక్ అవర్స్‌లో మార్పులు..
ఒకప్పుడు నగర వ్యాప్తంగా ఒకే సమయాలు రద్దీ వేళలుగా ఉండేవి. ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయం పీక్ అవర్‌గా మారుతోంది. ఆయా వేళల్లో అన్ని స్థాయిల అధికారులూ రోడ్లపైనే ఉంటారు. ట్రాఫిక్ పర్యవేక్షణే మా తొలి ప్రాధాన్యం. జరిమానా విధింపులో ఎన్ని జారీ చేశారనేది కాకుండా ఎలాంటి ఉల్లంఘనలపై చేశారన్నది చూస్తాం. ట్రాఫిక్ ఠాణా వారీగా వీటిని విశ్లేషిస్తాం. ఉల్లంఘనల వారీగా ప్రతి వారం ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో టెక్నాలజీ వినియోగిస్తాం. స్టాప్ లైన్ వద్ద డిసిప్లిన్ కనిపిస్తే ఇతర ఉల్లంఘనలు తగ్గుతాయని గుర్తించడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వీలున్న ప్రతి జంక్షన్‌లో ఫ్రీ లెఫ్ట్ విధానం అమలు చేస్తాం. రద్దీ వేళల్లో అవసరమైన మార్గాలను రివర్సబుల్ లైన్‌లుగా మారుస్తాం. జంక్షన్లు, యూటర్నులను అభివృద్ధి చేయిస్తాం. తీవ్రమైన ఉల్లంఘలపై ప్రత్యేక దృష్టి పెడతాం.
ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక చర్యలు..
వాహన చోదకుల్లో అవగాహన పెంచడానికి సోషల్ మీడియా, షార్ట్‌ఫిలింస్ తదితరాలను వినియోగిస్తాం. ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయిస్తాం. బాటిల్‌నెక్స్‌ను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటాం. పబ్స్ అంశంలో జీహెచ్‌ఎంసీ, ఎక్సైజ్ అధికారులతో సమావేశమవుతాం. ప్రస్తుతం సిబ్బంది కొరత కారణంగా 150 జంక్షన్లలో మోహరించలేకపోతున్నాం. ఆయా వర్గాలతో సంప్రదింపులు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాల తర్వాతే చర్యలు ఉంటాయి.
వ్యక్తిగత వాహనాల్లో గణనీయమైన పెరుగుదల
‘కొవిడ్ తర్వాత గ్రేటర్ పరిధిలో వ్యక్తిగత వాహనాలు గణనీయంగా పెరిగాయి. 2020 జనవరిలో 64 లక్షలున్న వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు నాటికి 18 శాతం పెరిగి 77.65 లక్షలకు చేరింది. కార్లు 11 లక్షల నుంచి 21 శాతం పెరిగి 14 లక్షలకు, ద్విచక్ర వాహనాలు 46.46 లక్షల నుంచి 17 శాతం పెరిగి 56 లక్షలకు చేరాయి. ప్రతి రోజూ డయల్–100కు వస్తున్న కాల్స్‌లో 70 నుంచి 80 శాతం ట్రాఫిక్ సమస్యల పైనే. భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అంతా కలిసి సమష్టిగా, సమన్వయంతో ముందుకు వెళ్లాలి’
Comments
Please login to add a commentAdd a comment