సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీజన్లపై త్వరలో మెట్రో చార్జీల పిడుగు పడనుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి కల్పించేందుకు ఏర్పాటు చేసిన కలల మెట్రోలో జర్నీ సామాన్యుడికి మరింత ప్రియం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మహానగర పరిధిలో నాలుగేళ్ల క్రితం నుంచి మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. తాజాగా చార్జీల సవరణ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆర్డర్ నెం. కె–14011/29/2018–ఎంఆర్‌టీఎస్–2 ప్రకారం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేంద్రకుమార్ బగ్డె, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్‌ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నగర వాసులు, మెట్రో ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని హెచ్‌ఎంఆర్ బహిరంగంగా ప్రకటించింది. నవంబరు 15 వరకు గడువు ఇచ్చింది. నగరవాసులు ‘ఎఫ్‌ఎఫ్‌సీహెచ్‌ఎంఆర్‌ఎల్ ఎట్‌రేట్‌జీమెయిల్.కామ్’కు సలహాలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని కోరింది.
చార్జీల వడ్డింపుతో నిరాదరణే..
నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు రూట్లలో 57 రైళ్లను నడుపుతున్నారు. నిత్యం సుమారు 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రోలో కనీస చార్జీ రూ.10 గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, తమ ఇళ్ల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు ప్రత్యేకంగా షటిల్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
మెట్రో అధికారుల ముందస్తు అంచనాల మేరకు ఈ మూడు రూట్లలో 16 లక్షల మంది జర్నీ చేస్తారని అంచనా వేసినప్పటికీ.. పలు కారణాల రీత్యా మెట్రోకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా చార్జీలు మరింత పెంచితే ప్రయాణికుల నిరాదరణ తప్పదని ప్రజారవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణం అంచనాలు, వినియోగ వ్యయాలు, మెట్రో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మెట్రో చార్జీలను సవరించనున్నట్లు తెలిసింది. నగర మెట్రోలో కనీస చార్జీ ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీ రూ.60 నుంచి రూ.100కి పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment