మూసాపేట: బాలాజీనగర్ డివిజన్ ఆంజనేయనగర్‌లో రూ.లక్షలు వెచ్చించి ఓపెన్ నాలాను నిర్మిస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా వరదనీరు సాఫీగా వెళ్లేందుకు ఈ నాలా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ రోడ్డులో ఇప్పటికే ఉన్న నాలాలో వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీరు కూడా పారుతోంది. ఈ నాలాను ఇటీవల కొద్ది భాగం మరమ్మతులు చేయించారు. ఇది వరకే ఓ నాలా ఉండగా మరో నాలాను ఎందుకు నిర్మిస్తున్నారో అని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పాత నాలాతో పోల్చుకుంటే వెడల్పు, లోతు కూడా తక్కువగానే ఉన్నాయి. అందులో నాలా కల్వర్టు వద్ద 300 ఎంఎం డయా మంచినీటి పైపులైను వెళ్లడంతో నీరు సాఫీగా వెళ్లేందుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
ఆంజనేయనగర్‌లో రంగనాయక స్వామి దేవాలయం కాంపౌండ్ వాల్ నుంచి ఓపెన్ నాలా ఉంది. ఎండాకాలంలో ఆలయం కాంపౌండ్ వాల్ నుంచి పాపనాశేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారి వరకు మరమ్మతులు చేశారు.
ఆంజనేయనగర్‌కు వెళ్లే రహదారి వరకు కనీసం నాలాలో పూడిక తీయకపోగా రాళ్లు రప్పలతో నిండిపోయింది. రహదారి నుంచి నాలాలో డ్రైనేజీ నీరు పారుతోంది.
కనీసం ఇక్కడ పూడికతీత పనులు కూడా చేయలేదు. చిన్నపాటి వర్షం వచ్చినా నాలా పొంగి రోడ్డుపై ప్రవహించే అవకాశం ఉంది.
ఇక్కడ పాత ఓపెన్ నాలానే పూడిక తీసి మరమ్మతులు తీస్తే సరిపోతుందని కొత్త లైను అవసరం లేదంటూ స్థానికులు పేర్కొంటున్నారు.
కొత్తలైను కూడా పాతలైను ఉన్నంత వరకు కాకుండా మధ్యలోనే పాపనాశేశ్వరం ఆలయంకు వెళ్లే దారి వద్ద పాత నాలాలోనే కలుపుతున్నారు. ఇంత వరకే కొత్తలైను వేయాల్సిన అవసరం ఎంటోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పై నుంచి వచ్చే వర్షపు నీరు పాత నాలాలో సరిపోవటం లేదని అనుకున్నా కొత్త లైను పూర్తిగా వేయాలి. కానీ మధ్యలోనే పాతలైనులో కలపటంతో అననుమానాలకు దారి తీస్తోంది.
కొత్త లైన్‌లో కల్వర్టు వద్ద నాలాలో 300 ఎంఎం డయా మంచినీటి పైపులైను వెళ్లటంతో నాలాలో నీరు వెళ్లేందుకు అవకాశం లేదు. కొద్దిపాటి వ్యర్థాలు అడ్డుపడినా వరద, మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది.
రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు..
వర్షపు నీటికి పాత లైను సరిపోక పోవటంతో కొత్తది నిర్మిస్తున్నాం. పాపనాశేశ్వర స్వామి ఆలయం వద్ద టీ– జంక్షన్ ద్వారా నీటిని కొత్త నాలాలోకి మళ్లించి రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-శ్రీదేవి, డీఈ
Comments
Please login to add a commentAdd a comment