సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా బెంబేలెత్తిస్తున్న కోవిడ్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ థర్డ్‌వేవ్ అంతమవుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటంతో హాలీడే ట్రిప్‌లు, ఫారెన్ వెకేషన్లకు వెళ్లాలనుకునేవారిలో కొత్తఆశలు చిగురిస్తున్నాయి. రెండు, మూడురోజుల వీకెండ్, షార్ట్ ట్రిప్‌లకు వెళుతున్నవారూ ఉన్నారు. 2020 నుంచి రెండు వేసవికాలాల్లో సరదాగా దూర ప్రాంత విహారాలకు వెళ్లి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ
నేపథ్యంలో ఈసారి సమ్మర్ వెకేషన్లకు వెళ్లడానికి ముందు నుంచే చాలామంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 2, 3 రోజుల చిన్న ట్రిప్, వీకెండ్ టూర్, సమ్మర్ వెకేషన్, ఫారెన్ టూర్లకు కుటుంబసభ్యులు, ఆప్తులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులతో వెళ్లాలనే భావన అత్యధికుల్లో పెరిగింది. ఈ అంశాలపై తాజాగా హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ‘ఓయో’కన్జుమర్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ముఖ్యాంశాలు...
♦ తమకు అత్యంత ఆప్తులు, సన్నిహితులతో కలసి వెళ్లేందుకు మూడోవంతు వంతు మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు
♦ ఇలాంటి ట్రిప్‌లు తమకు నచ్చిన వారితో అనుబంధం మరింత పటిష్ట పరుస్తాయంటున్నవారు 84 శాతం
♦ దగ్గరలోనే ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు 62 శాతం మంది మొగ్గు
♦ గతంలో పోల్చితే హాలీడే ట్రిప్‌లు, వెకేషన్లపై వెళ్లేందుకు మూడింట రెండు వంతుల మంది సిద్ధం
♦ వాలంటైన్ డే సందర్భంగా ప్రేమికులు, దంపతులు, స్నేహితులు వెళ్లాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో మొదట గోవా ఆ తర్వాతి స్థానంలో మనాలి ఉంది.
♦ తమ ఆప్తులు, దగ్గరివారితో నాణ్యమైన సమయం గడపాలనే భావనలో 38% మంది
♦ రొటీన్ జీవితం నుంచి తప్పించుకుని వెకేషన్లపై వెళ్లాలనుకునేవారు 26 శాతం
♦కొత్త ప్రాంతాలను సందర్శించి, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నవారు 25 శాతం
♦పారిస్, మాల్దీవులు, స్విట్జర్లాండ్‌కు వెళ్లానుకునేవారు అత్యధికంగా ఉన్నారు.
రివెంజ్ టూరిజంలో భాగమే...
మార్చి తర్వాత మనదేశంలో, రాష్ట్రంలో హాలీడే వెకేషన్లు, ట్రిప్‌లు పెరగనున్నాయి. ఇప్పటికిప్పుడు వెంటనే విదేశీ ట్రీప్‌లకు వెళ్లేందుకు ఆచితూచి స్పందిస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ పూర్తిస్థాయిలో సాగితే ఐరోపా, సింగపూర్, థాయ్‌లాడ్, ఇతర దేశాలకు డిమాండ్ విపరీతంగా పెరగనుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎక్కువగా గోవా, హిమచల్‌ప్రదేశ్ తదితర చోట్లకు ఎక్కువగా వెళుతున్నారు. టూర్లకు, లగ్జరీ హోటళ్లలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు గతంతో పోల్చితే 50, 60 శాతం ఎక్కువగా ఎంక్వైరీలు పెరిగాయి.
– అజయ్ రామిడి, ఎండీ లార్వెన్ టూర్స్, ట్రావెల్స్
Comments
Please login to add a commentAdd a comment