సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీంకు సుదీర్ఘకాలం కుడిభుజంగా మెలిగిన ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్నపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. శేషన్నపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో 11 కేసులు ఉన్నాయి. 2004లో అచ్చంపేటలో వి.రాములు, 2005లో మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ టీచర్ కనకాచారి, అదే ఏడాది అక్కడే చెంచు గోవిందు, 2011లో పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, బొగ్గులకుంటలో పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, 2013లో అచ్చంపేటలో మాజీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, 2014లో నల్లగొండలో మాజీ నక్సలైట్ కొనాపురి రాములు హత్య కేసులతోపాటు పలు బెదిరింపుల కేసులు శేషన్నపై ఉన్నాయి.
2016లో నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల నగరంలో బెదిరింపుల దందా చేయడానికి వచ్చిన శేషన్నను గోల్కొండ పోలీసులు సెప్టెంబర్ 27న అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి వద్ద నాటుతుపాకీ, తూటాలు లభించాయి. హుమాయున్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లాకు ఇతడు గతంలో తుపాకీ సరఫరా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. శేషన్నపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక కేసులు ఉన్నాయి. ఇతడి నేరచరిత్రను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ పీడీ యాక్ట్ ప్రయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment