జాతీయ జెండాతో కిలిమంజారో పర్వతంపై తరుణ్ జోషి, అన్వితారెడ్డి
సాక్షి, హైదరాబాద్/భువనగిరి: సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి ఖాతాలోకి మరో మైలురాయి వచ్చి చేరింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను ఆయన శుక్రవారం ఉదయం 8.15 గంటలకు అధిరోహించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు పర్వతాలను ఈయన ఎక్కారు. నగర నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న జోషి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడమే తన లక్ష్యంగా సాధన చేస్తున్నారు.
జోషి పంజాబ్‌కు చెందిన వ్యక్తి. పటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పట్టా పుచ్చుకుని దంత వైద్యుడయ్యారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణుడైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్‌లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా పని చేస్తున్నారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోని మౌంట్ రీనాక్‌ను అధిరోహించారు.
అన్వితారెడ్డి కూడా...
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన అన్వితారెడ్డి కూడా జోషితో కలసి కిలిమంజారోను అధిరోహించారు. భువనగిరికి చెందిన పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళల కమార్తె అన్విత భువనగిరి ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో 2018 నుంచి రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్‌లో శిక్షణ పొందారు. అనంతరం ఖిల్లా వద్దనే శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. ‘చదువుతో పాటు పర్వతారోహణ అంటే ఇష్టం. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. పర్వతారోహణకు గురువులు శేఖర్‌బాబు, పరమేశ్ ఎంతగానో ప్రోత్సహించారు’అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment