
సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకత్వం ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పైనా పోటీ చేసేందుకు సిద్ధమని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. బీజేపీలో తాను మనస్ఫూర్తిగానే కొనసాగుతున్నానని, పార్టీ లు మారే సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాతే తాను బీజేపీలో చేరినట్టు తెలిపారు. టీఆర్‌ఎస్‌ను కూడా తాను వీడలేదని, వాళ్లే వెళ్లగొట్టారని స్పష్టం చేశారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా గురువారం జరిగిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు. ‘‘టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంగా మారింది. అందులోని అంశాలేవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఎవరూ సంతోషంగా లేరు. ఆ పార్టీలో తమకు భవిష్యత్ లేదని చాలా మంది భావిస్తున్నారు. మంత్రిగా నేను ప్రగతిభవన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు లేకుండానే విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా అవకాశమివ్వలేదు. చాలా సందర్భాల్లో నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఎన్నో రూపాల్లో అవమానించారు. కేబినెట్ మంత్రిగా కాదు... కనీసం మనిషిగా గుర్తించలేదు. నాకే కాదు గతంలో నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, తదితరులకు కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. తన ముని మనమడు వరకు అధికారంలో ఉండాలంటే తెలంగాణ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఇంకా ఎవరితోనూ విభేదాలు లేవు. అందరం కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం’’అని ఈటల అన్నారు. తనలాంటివారికి, వందల ఎకరాలున్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు, ఇతర అంశాలపై ముందుచూపు లేకుండా, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment