
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యంతో బాధపడుతున్న వారి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు పరిష్కారాలు కనుగొనేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) సోమవారం ‘అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు 2.0’ ను నిర్వహించింది. రాష్ట్ర ఐటీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త భాగస్వామ్యంలో జరిగిన ఈ సదస్సులో 18 విద్యార్థి బృందాలు ప్రత్యక్షంగా, మరో ఐదు బృం దాలు వర్చువల్ విధానంలో పాల్గొన్నాయి.
రాష్ట్రంలో సాంకేతికవిద్యను అవలంబిస్తున్న విద్యార్థుల నుంచి వికలాంగుల సమస్యల పరిష్కారానికిగాను ఆలోచనలు, నమూనాలను టీఎస్‌ఐసీ ఆహ్వానించింది. మొత్తం 87 మంది బృందాలు దరఖాస్తు చేయగా, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ నిపుణులు డాక్టర్ బ్యూలా క్రిస్టీ, యూత్ 4 జాబ్స్ వ్యవస్థాపకుడు మీరా షెనాయ్ తదితరుల నేతృత్వంలోని బృందం వీటిని మదింపు చేసింది. సదస్సులో పాల్గొన్న 23 బృందాల్లో మూడు అత్యుత్తమ బృందాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు.