సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కూడా చేస్తోంది. మువ్వన్నెల పతాక రెపరెపలతో జాతీయ పండుగను ఘనంగా జరపాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కానీ జాతీయ జెండాను ఎగురవేయాలన్నా, మరే విధంగానైనా త్రివర్ణ పతాకాన్ని వాడుకోవాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.
జాతీయ జెండా ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధనలను పాటించాలి. జెండాను ఉపయోగించే విధానంలో ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించనట్లైతే చట్టం రూపొందించిన ప్రకారం శిక్షలు, జరిమానాలను విధిస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ జెండాను అవమానపరిచినా, అగౌరవపరిచినా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముంది.
చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం
ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద చేతులకు మూడు రంగుల బ్యాండ్లతో అతివల ఆనంద హేల
నియమాలివీ..
జాతీయ జెండాను అత్యంత గౌరవప్రదంగా చూసుకోవాలి. జెండాను ఎగురవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా ఉండకూడదు. మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప మరే వర్ణాలు, రాతలు ఉండకూడదు. కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి. నిలువుగా ప్రదర్శించే సమయంలో కాషా యం రంగు ఎడమ వైపున ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగురవేయకూడదు.
జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు. జాతీయ జెండాను నేల మీద అగౌరవప్రదంగా పడేయకూడదు. వివిధ అలంకరణ సామగ్రిగా జాతీయ జెండాను ఉపయోగించరాదు. పబ్లిక్ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్ పైన కుడి వైపున మాత్రమే (ప్రేక్షకులకు ఎడమ వైపుగా) జెండాను నిలపాలి. జెండాపై ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు. పతాకం మధ్యలో పూలను వాడవచ్చు. వస్తువులపై, భవనాలపై జెండాను కప్పకూడదు. దుస్తులుగా కుట్టించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment