కాటిక వెన్నెల
యాచారం: ‘డాడీ భయంగా ఉంది. బాంబుల మోతతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నా. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. నన్ను ఎలాగైనా ఇంటికి రప్పించు ప్లీజ్’ అని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్య విద్యార్థి తన తండ్రితో అన్న మాటలివి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చెందిన కాటిక వెంకటయ్య, సుగుణ దంపతుల కుమార్తె కాటిక వెన్నెల వైద్య విద్యను అభ్యసించేందుకు మూడు నెలల కిందట ఉక్రెయిన్ వెళ్లింది.
అక్కడి వినిస్తియా యూనివర్సిటీలో చదువుకుంటోంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భయాందోళన చెందుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో తిండీ నిద్ర లేకుండా పోతోందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరుమున్నీరైంది. ప్రాణాలతో బతికి వస్తామోలేదో డాడీ, మమ్మీ అంటూ బోరున విలపించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
వెన్నెలను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన 300 మంది విద్యార్థులం వినిస్తియా యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం నుంచి సహకారం లేదని, వెళ్లిపోండి.. జాగ్రత్తగా ఉండండి.. బాంబులు ఎప్పుడైనా పడొచ్చని హెచ్చరిస్తున్నట్లు విలపిస్తూ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment