
హరిదాస్‌పూర్‌లో ఆడపిల్లలతో వారి తల్లులు
సాక్షి, సంగారెడ్డి: ‘‘..మళ్లీ ఆడపిల్లేనా..?!’’రెండోకాన్పులో కూడా ఆడబిడ్డ పుట్టినప్పుడు ఇలాంటి మాట తరచూ వింటుంటాం. ఆడపిల్లను గుండెల మీద మోయలేని భారంగా భావిస్తుంటారు. కానీ, అక్కడ ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగ వాతావరణమే.. ఇంటింటా సంబురమే. మిఠాయిలు పంచుకుంటారు.. గ్రామ పంచాయతీ భవనాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరిస్తారు. చిన్నారికి, తల్లిదండ్రులకు కొత్తబట్టలు పెట్టి ఆ కుటుంబానికి భరోసా ఇస్తారు. ఆ గ్రామమే కొండాపూర్ మండలంలోని హరిదాస్‌పూర్. ఆదర్శంగా నిలుస్తున్న హరిదాస్‌పూర్‌పై ‘సాక్షి’ప్రత్యేక కథనం...
ఆలోచన వచ్చింది అప్పుడే..
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామ సర్పంచ్ షఫీ, కార్యదర్శి రోహిత్ కులకర్ణి ఇంటింటికీ తిరిగి పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కమలమ్మ ఇంటికి వెళ్లారు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది. చిన్న కూతురు సత్యవతికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం చేసుకుంది. సత్యవతికి మొదటి రెండు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. మూడో కాన్పు కూడా ఆడపిల్లే పుట్టడంతో కమలమ్మ తీవ్ర నిరాశ చెందింది. సర్పంచ్, కార్యదర్శికి కమలమ్మ తన ఆవేదన చెప్పుకుంది. దీంతో ఈ కుటుంబానికి అండగా ఉండాలని భావించారు. ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంటింటా విస్తృతంగా అవగాహన కల్పించారు. అప్పటి నుంచి గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.
చదవండి: ప్రియురాలి కండిషన్.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..
సుకన్య సమృద్ధి యోజన పథకంలో నమోదు
ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ చిన్నారి పేరిట బ్యాంకులో, పోస్టాఫీసులో ఖాతా తెరుస్తారు. కేంద్రం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో నమోదు చేస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.వెయ్యిని గ్రామపంచాయతీవారే చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు 85 మంది ఆడపిల్లల పేర్లను ఈ పథకం కింద నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హరిదాస్‌పూర్‌ను ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించింది. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తమ గ్రామానికి అవార్డును అందజేయనున్నట్టు పంచా యతీ కార్యదర్శి రోహిత్ కులకర్ణి ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: Ukraine Cat: ఉక్రెయిన్ నుంచి పిల్లిని తెచ్చుకున్నాడు.. కానీ