హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు.. రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో ప్రచారం సాగిస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, కార్యక్తరలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు హోమ్ ఓటింగ్ (ఇంటి దగ్గర నుంచే ఓటు) సదుపాయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది: కోమటిరెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహ్మత్ నగర్ డివిజన్, PJR టెంపుల్ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల మేలు కోరే కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని జూబ్లిహిల్స్ ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... “కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం పూర్తి చేశారు, కానీ రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు” అని గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను విమర్శించారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ మూడు సంవత్సరాలు కాదు, రాబోయే ఐదేళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. “పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారు. వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది” అని చెప్పారు.
అలాగే బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను వ్యంగ్యంగా ఎత్తిచూపుతూ, “కేటీఆర్ చెబుతున్నట్టు రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం మారుతుందట, కానీ కెసీఆర్ ఇప్పుడు ఫార్మ్‌హౌస్ లోకి వెళ్లి బయటకు రారు” అని వ్యాఖ్యానించారు.
ప్రజలు, బుద్ధిజీవులు,మేధావులు ఆలోచన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాలు నాయక్, వేముల వీరేశం, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
నేడు సీఎం ప్రచారం ఇలా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు షేక్ పేట డివిజన్ లో కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.
కేటీఆర్ రోడ్ షో
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ రోజు రాత్రి 7 గంటలకు సోమాజిగూడ డివిజన్‌లో భారీ రోడ్ షో నిర్వహిస్తారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఈరోజు ఎర్రగడ్డ డివిజన్‌లో కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కల్పతరువు రెసిడెన్సీ, మల్టీపర్పస్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
నేటి నుంచి హోమ్ ఓటింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హోమ్ ఓటింగ్ సదుపాయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇవాళ, ఎల్లుండి ఇంటి వద్దనే ఓటు వేసేందుకు వికలాంగులు, వృద్ధులకు అవకాశం ఉంటుంది. హోమ్ ఓటింగ్‌కి 84 మంది వృద్ధులు, 19 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్‌ను ఆదరించండి: శ్రీధర్ బాబు
మంగళవారం శ్రీనగర్ కాలనీ లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.. బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి.. నిరంతరం జూబ్లీహిల్స్ ఓటర్లకు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


