ప్రతి ఇంచూ డిజిటల్‌ సర్వే | k Chandrashekar Rao Launched Dharani Portal At Muduchintalapalli | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంచూ డిజిటల్‌ సర్వే

Published Fri, Oct 30 2020 12:53 AM | Last Updated on Fri, Oct 30 2020 4:59 AM

k Chandrashekar Rao Launched Dharani Portal At Muduchintalapalli - Sakshi

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లిలో గురువారం ధరణి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘తెలంగాణలోని ప్రతి ఇంచు జాగాను డిజిటల్‌ మెకానిజంలో పూర్తిగా సర్వే చేస్తం. గట్టు నిర్ణయించి అక్షాంశాలు, రేఖాంశాలు రికార్డు చేస్తరు. భూగోళం ఎన్ని రోజులుం టదో అన్ని రోజులు ఈ రేఖ ఉంటది. ఎవ్వరూ దీనిని మార్చలేరు. ఎల్లయ్యకు ఫలాన సర్వే నంబర్, ఫలానగ్రామం, ఫలాన జిల్లాలో ఈ అక్షాంశాలు, రేఖాంశాల మధ్య ఇంత భూమి ఉంది అని రికార్డుల్లో రాస్తరు. అప్పుడు ఆ భూమి హద్దులను చెరిపేయ డం ఎవరి వల్లా కాదు. వంద శాతం చెక్కు చెదర కుండా ఉంటుంది. ప్రపంచం లోని ఏ శక్తీ దీన్ని మార్చలేదు. టాంపర్‌ చేయలేదు. కిరికిరిగాళ్లు కూడా ఏం చేయలేరు’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మేడ్చల్‌ –మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతల పల్లిలో గురువారం ఆయన ధరణి పోర్టల్‌ను ప్రారం భించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ధరణి పోర్టల్‌ పనితీరు, ప్రత్యేకతలను వివరించారు. ‘ధరణి పోర్టల్‌ భారత దేశానికే ట్రెండ్‌సెట్టర్‌. ప్రపంచంలో క్లీన్‌ ల్యాండ్‌ రికార్డులున్న ప్రాంతం భారతదేశం లోని తెలంగాణ అని ప్రపంచవ్యాప్తంగా పేరురావాలి. దేశంలో తొలిసారిగా రెవెన్యూ రికార్డుల్లో ఎలక్ట్రానిక్‌ ఇంటర్వెన్షన్‌ ప్రవేశపెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. శాశ్వతంగా భూ బాధలుపోవాలి’ అని సీఎం ఆకాంక్షించారు.

గురువారం మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, ధరణి పోర్టల్‌ను మొబైల్‌ ఫోన్‌లో చెక్‌ చేస్తున్న సభకు హాజరైన మహిళలు 

ఇకపై పహణీలో మూడే కాలమ్స్‌ 
‘పహణీలో ఇంతకుముందు 33 కాలమ్స్‌ ఉండే. ఇప్పుడే మూడే మూడు ఉంటయి. రైతు పేరు, పట్టాదారుపేరు ఉంటది. ఏయే కాలం (పంట కాలం) ఉంటది. మన భూమి ఉంటది. ఎవరూ మార్చలేరు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. భవిష్యత్తులో సంపూర్ణమైన యాజమాన్య హక్కులిచ్చే దిశగా పోతున్నం. సర్వే తర్వాత స్పష్టత వస్తే అప్పుడిచ్చే అవకాశం వస్తుంది. అది సువర్ణావకాశం. ధరణి వచ్చిన తర్వాత భూముల మార్పిడి ఇక జరగదు. సాదాబైనామాలకు ప్రభుత్వం ఇప్పటికే చిట్టచివరి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కేవలం రిజిస్ట్రేషన్‌ ద్వారానే భూమి మారుతుంది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటివరకు 1.64 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంకో వారం పొడిగించాలని సీఎస్‌ను కోరుతున్న. దాని తర్వాత సాదాబైనామా ఉండదు. సాదాబైనామా రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక రూపాయికి కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టం. అటవీ, పోడు, వక్ఫ్‌ భూములు తేలాలి. దీనికి కూడా సర్వే సమాధానం ఇస్తది. చేవెళ్ల దగ్గర గిరిజనులు ఏళ్ల నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్నరు. వారికి పోడు భూముల పట్టాలిస్తం’ అని సీఎం తెలిపారు. ఒక్క క్లిక్‌తో ఆర్థికశాఖ కార్యదర్శి నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయడానికి ధరణి వీలు కల్పిస్తుందన్నారు. రైతుల బాకీలన్నీ తీరిపోయి బ్యాంకు ఖాతాల్లో నాలుగైదు లక్షల రూపాయలున్నప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్టు అన్నారు. కౌలు రైతుల కోసం రికార్డుల్లో అనుభవదారుడి కాలమ్‌ పెడితే వారు కోర్టుకెళ్లి అసలుదారుడికి ఎసరుపెట్టే అవకాశం ఉందనే కౌలుదారులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. 

15, 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌
‘రిజిస్ట్రేషన్‌కు పైరవీలు అవసరం లేదు. ధరణి పోర్టల్‌/ మీ సేవ/ వ్యక్తిగతంగా ఆఫీసుకు పోయి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మాత్రమే ఉండే. అదనంగా 570 తహసీల్దార్‌ కార్యాలయాలు కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా మారినయి. రిజిస్ట్రేషన్‌ కోసం మీ ఇష్టమున్న రోజు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ముందే ఫీజు కట్టేయవచ్చు. మీరే దస్తావేజులు రాసుకుంటాం అంటే నమూనా పత్రాలు కూడా సిద్ధంగా ఉంటయి. రాయించుకుంటాం అంటే డాక్యుమెంట్‌ రైటర్లు ఉంటరు. వారికి నిర్ణీత ఫీజు ఉంటది. ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడానికి లేదు. రానున్న 10 – 15 రోజుల్లో ఏ మండలానికి ఎవరు డాక్యుమెంట్‌ రైటర్లు ఉంటరో జిల్లా కలెక్టర్లు అధికారికంగా ప్రకటిస్తరు. క్రయవిక్రయాలు జరిపే ఇద్దరూ వ్యవసాయదారులైతే ఇద్దరికీ పాసుబుక్కులుంటయి. ఒకాయన రెండెకరాలు ఇంకొకాయనికి అమ్మిండు. ఇద్దరి మధ్య బేరం అయిపోయిన తర్వాత వారిద్దరు కలిసి మేము ఫలాన విధంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకుంటున్నం, ఆ ప్రకారం ఈ ఫీజు చలాన్‌ ద్వారా కడుతున్నం అని తహసీల్దార్‌ కార్యాలయానికి సమాచారమివ్వాలి. మ్యుటేషన్‌ ఫీజు కూడా ఉంటది.

రెండు ఫీజులు కడితే హక్కు స్థాపితం అవుతుంది. మ్యుటేషన్‌  ఫీజు చాలా స్వల్పంగానే పెట్టినం. ఫీజులు కట్టాక మీరు కోరుకున్న రోజు మీకు స్లాట్‌ కేటాయిస్తరు. కార్యాలయానికి వచ్చాక గరిష్టంగా 15 – 20 నిమిషాల్లో అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ అయిపోతుంది. కొన్నాయన పాస్‌బుక్‌లో భూమి ఎక్కుతది. అమ్మినాయిన పాస్‌బుక్‌ నుంచి దానిని తీసేస్తరు. అప్పుడే ధరణి సైట్‌లో కూడా వచ్చేస్తది. వాపస్‌ వెళ్లిపోయేటప్పుడు ఎవరి పాస్‌బుక్కులు వారికి ఇస్తరు. రిజిస్ట్రేషన్‌ కాగితాలను కొనుక్కున్న ఆయనకు ఇస్తరు. ధరణిలో ఎక్కినటువంటి నకలు ఇస్తరు. మీరు ఇలా హ్యాపీగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. బ్యాంకు పాస్‌బుక్‌ ఎలా అప్‌డేట్‌ అవుతుందో ఇక్కడా భూమి అమ్మినా, కొన్నా ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అవుతది. కొనేటటువంటి వ్యక్తికి గతంలో పాస్‌బుక్‌ లేకుంటే కొత్త పాస్‌బుక్‌ ఇస్తరు. అందుకు కొంత ఫీజును కొరియర్‌ చార్జీలుగా ఇవ్వాలి. అప్పుడు తాత్కాలిక పాస్‌బుక్‌లాగా ఓ పత్రం ఇస్తరు. పాస్‌బుక్‌ ఎక్కడపడితే అక్కడ ప్రింట్‌ చేయరు. దుర్మార్గులకు తెలిస్తే నకిలీ పాస్‌బుక్కులు ప్రింట్‌ చేస్తరు కాబటి రహస్యంగా చేస్తుంది ప్రభుత్వం. అలా ఆర్డర్‌ ఇచ్చిన పాస్‌బుక్‌ పోస్టల్‌ ద్వారా ఇంటికే వస్తది. మనుషుల ప్రమేయం లేకుండా ఒక్క రూపాయి అవినీతి లేకుండా జరిగిపోతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని వివరించారు.

తహసీల్దార్లే బాధ్యులు
‘చట్టం చాలా స్పష్టంగా ఉంది. భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తహసీల్దార్, కొనేటాయన, అమ్మేటాయనకు సంబంధించిన బయోమెట్రిక్‌ వేలిముద్రలతోనే పోర్టల్‌ తెరుచుకుంటది. అ అధికారం జిల్లా కలెక్టర్, రెవెన్యూ కార్యదర్శి, రెవెన్యూ మంత్రికి కూడా లేదు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసి.. నేను చేయలేదు. ఆ సంతకం నాది కాదని అనేవారు. తహసీల్దార్లు ఇకపై అలా తప్పించుకోవడానికి లేదు. రిజిస్ట్రేషన్‌ జరిగిందంటే తహసీల్దారే బాధ్యుడు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తహసీల్దార్లు లేకుంటే, సమయానికి ఏదైన కారణంతో రాకపోయినా, సెలవుపెట్టినా నాయబ్‌ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేస్తరని సీఎం తెలిపారు. 

హేరాపేరీకి అవకాశం లేదిక..
‘భూ సమస్యల శాశ్వత నివారణకు ధరణి పోర్టల్‌ తీసుకొచ్చాం. పెద్ద విప్లవం, గొప్ప సంస్కరణలు వచ్చినప్పుడు కొన్ని బాలారిష్టాలు ఉంటయి. వాటిని తట్టుకుని ముందుకుపోవాలి. ప్రతికూల శక్తులుంటయి. ఎక్కడ్నో ఏదో మండలంలో చిన్న పొరపాటు వస్తే దాన్నే ఎక్కువ చేసి చూపించే అవకాశం ఉంటది. దానికి ప్రజలెవరూ ఆందోళనపడొద్దు. ఇది పూర్తిగా పారదర్శకమైన పోర్టల్‌. అన్ని రకాలుగా క్లీన్‌ అయిన కోటీ 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నయి. వీటిపై ఎలాంటి పంచాయితీ, కిరికిరి లేవు. వీటి వివరాలను ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్‌లైనా సరే చూసుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో ఒకరి భూమి ఇంకొకరి పేరుపై రాయడం, మార్చడం, గోల్‌మాల్‌ చేయడం ఉండదు. దేవాలయ, వక్ఫ్, ప్రభుత్వ, అటవీ భూములను ఇంతకుముందు ఎవరికిపడితే వారికి రిజిస్ట్రేషన్లు చేసినరు. దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ను ఓ ప్రబద్ధుడు రిజిస్ట్రేషన్‌ చేస్తే ఓ బ్యాంకు వాళ్లు నమ్మి లోన్‌కూడా ఇచ్చారు. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అటవీ భూములన్నీ కూడా ధరణి పోర్టల్‌లో ఉంటయి కానీ, ఆటోలాక్‌లో ఉంటయి. ఎమ్మార్వో,  కలెక్టర్‌ ఓపెన్‌ చేయాలన్నా ఓపెన్‌ కావు. హేరాపేరీ జరగడానికి అవకాశం ఉండదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కోర్టు తీర్పులకు అనుగుణంగా పార్ట్‌–బీ భూములపై నిర్ణయం
‘మూడుచింతలపల్లిలో నూటికి 99 మందికి గట్లున్నయి. ఒకటి రెండు శాతం భూములకు మాత్రమే పంచాయితీలున్నయి. ఆ ఒక్క, రెండు శాతం భూముల కోసం మొత్తం కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేయాలని నేను అధికారులతో వాదించేవాడిని. ఆ విధంగానే నిర్ణయం తీసుకున్నం. పరిష్కారం కాని భూములను గతంలో పార్ట్‌–బీలో పెట్టినరు. ఈ వివాదాలపై వచ్చే కోర్టు తీర్పును బట్టి నిర్ణయం ఉంటది’ అని సీఎం అన్నారు.

ఇక విచక్షణాధికారాలకు చెల్లు
‘రిజిస్ట్రేషన్‌ ఫీజుల విషయంలో గతంలో సబ్‌రిజిస్ట్రార్‌కు కొంత విచక్షణాధికారం ఉండేది. సపోజ్‌ మన పక్క సర్వేనంబర్‌ వాడు రూ.20లక్షల ధరతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుండు. నువ్వుకూడా అదే రేటుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సబ్‌రిజిస్ట్రార్‌ తన విచక్షణాధికారాలతో అడిగేవాడు. డబ్బులు తీసుకుని పాత ధరకే చేసేవాడు. ఇప్పుడు అలాంటి విచక్షణాధికారం లేదు. పాత రిజిస్ట్రేషన్‌ ధరలనే మళ్లీ నిర్ధారించాం. ఈ విలువ ప్రకారమే ఫీజులివ్వాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. 

వారసత్వంపై కుటుంబాలే నిర్ణయించుకోవాలి
‘కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఫౌతి (వారసత్వ) హక్కులు మార్చుకునే అధికారం ఆ కుటుంబానికే మేము ఇచ్చినం. కుటుంబసభ్యులంతా కూర్చుని వాటాలపై తీర్మానం చేసుకుని ఎమ్మార్వోకి ఇస్తే ఆ మేరకు వారసత్వ మార్పిడి చేస్తరు. లేదంటే సివిల్‌ కోర్టుకు వెళ్లి తేల్చుకోమని చెప్పినం. వారసత్వ మార్పిడిలో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ రాసిండని గతంలో మాదిరిగా తహసీల్దార్లను తిట్టడానికి అవకాశం ఉండదు’ అని సీఎం స్పష్టం చేశారు.  

వీఆర్వోలను ఖాళీల్లో సర్దుబాటు చేస్తం..
‘భూసమస్య రైతులకు తలనొప్పిగా మారింది. ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్‌రెడ్డి, గౌతంకుమార్, రాజేందర్‌ ఈ సమావేశానికి నాతోపాటు వచ్చారు. వీఆర్వోల వల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తున్నదని, వీరందరినీ తీసివేయాలని వారికి చెప్పిన. ‘రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తామని ఎన్నికల్లో కూడా హామీనిచ్చారు. మీ ప్రజలకు వాగ్దానం ఇచ్చారు కాబట్టి నెరవేర్చాల్సిందే. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంద’ని వారు అన్నారు. వీర్వోలను ఏ శాఖలో ఖాళీలుంటే అక్కడ సర్దుబాటు చేస్తం. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి త్వరలో వారి సమస్యను తీరుస్తం’ అని సీఎం తెలిపారు. దేశానికే దిక్సూచిలాంటి ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టిన రెవెన్యూ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కొందరు అధికారులు చేసే తప్పులకు మొత్తం రెవెన్యూ శాఖను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

15–20 రోజుల్లో..  వ్యవసాయేతర  ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. 

  • మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన ‘ధరణి’ని 15–20 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆ తర్వాతే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం సాగు భూములకు ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిందని, సాంకేతికంగా సాధకబాధకాలను అంచనా వేసి పకడ్బందీగా ముందడుగు వేయనున్నట్లు తెలిపా రు. ఈ పోర్టల్‌ 12 రోజుల్లో వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ‘వ్యవసాయ, వ్యవసాయేతర ధరణి సాఫ్ట్‌వేర్‌లో తేడా ఉంటుంది. సాగు భూమికి ఒకరే పట్టాదారు ఉంటారు. అదే వ్యవసాయేతర(అపార్ట్‌మెంట్‌) ఆస్తికి వచ్చేసరికి చాలామంది యజమానులు ఉంటారు. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ధరణి ని రూపొందిస్తున్నాం’అని సీఎం చెప్పారు.

గురువారం మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సీఎం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తమ ఆస్తుల సమాచారాన్ని ఇతరులు చూడకుండా.. గోప్యంగా ఉంచుకోవాలని భావిస్తే.. దానికి అనుగుణం గా ధరణి సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక ఆప్షన్‌ ఇస్తున్న ట్లు ఆయన చెప్పారు. ధరణి సర్వర్లను దేశం లో వేర్వేరు చోట్ల భద్రపరిచామని, సమాచా రం భద్రంగా ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేష న్‌ చార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని, ప్రస్తుతం ఉన్నవాటినే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తేలిన తర్వాతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement