సాక్షి, జగిత్యాల(కరీంనగర్): నిరుపేద కుటుంబం. భర్త వికలాంగుడు. ఎదిగిన కొడుకు ప్రేమ పెళ్లి చేసుకొని ఇల్లు విడిచి వెళ్లాడు. దీంతో ఆ పేద మహిళకు ఇంటి పోషణ భారం కావడంతో ఓ గల్ఫ్ ఏజెంట్ ద్వారా 36 రోజుల క్రితం మస్కట్ వెళ్లింది. అక్కడ ఇంటి యజమాని పెట్టే చిత్రహింసలకు నరకం అనుభవిస్తున్నట్లు 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
కుటుంబ సభ్యులు ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుండగా స్విచ్ ఆఫ్ ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన కొదురుపాక సత్తమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలు అదే కాలనీకి చెందిన రమాదేవికి చెప్పుకోగా, ఆమె తన అన్న నిజామాబాద్‌లో గల్ఫ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న రవికుమార్‌కు పరిచయం చేయించింది.
ఈ క్రమంలో రవికుమార్, సత్తమ్మ వయస్సుతో పాటు మతం (క్రిస్టియన్‌గా) మార్చి పాస్‌పోర్టు తీయించాడు. నవంబర్ 4న ఇంటి పని కోసమని మస్కట్‌కు పంపించాడు. అక్కడకు చేరుకున్న సత్తమ్మ ఇంటి యజమానితో తాను హిందువు అని చెప్పడంతో ఆమెను తీవ్ర వేధింపులతో పాటు అనవసరమైన పనులు చేయించడం.. చేయకపోతే దాడిచేయడంతో చెయ్యి కూడా విరిగిపోయిందని 15 రోజుల క్రితం బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది.
దీంతో కుటుంబ సభ్యులు గల్ఫ్ ఏజెంట్ రవికుమార్ వద్దకు వెళ్లగా, తాను మస్కట్‌కు పంపించేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు అయిందని, ప్రస్తుతం రూ.లక్ష చెల్లిస్తే స్వగ్రామం రప్పిస్తానని చెప్పాడు. వారి వద్ద డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో జగిత్యాలలోని గల్ఫ్ సోషల్ వర్కర్ షేక్ చాంద్‌పాషాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతడు స్పందించి సత్తమ్మను స్వగ్రామం రప్పించేందుకు గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్‌తో పాటు భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
జాతీయ దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశాం
జిల్లా కేంద్రానికి చెందిన సత్తమ్మకు గల్ఫ్ ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టు ఇప్పించి మస్కట్ పంపించాడు. అక్కడ యజమాని ద్వారా ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం అందించడంతో పాటు మస్కట్ భారత రాయబార కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశాం.
– షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ సోషల్ వర్కర్, జగిత్యాల
చదవండి: యువతి అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment