బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితుౖడైన తోట చంద్రశేఖర్‌ను అభినందిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో రావెల కిషోర్‌బాబు తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘‘సువిశాల భారతదేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రజల ఆలోచనా సరళిని మార్చాలి. ఇందుకోసం ఆలోచనాపరులను ఏకం చేస్తాం. దేశంలో ఒక మూల కోసమో, రాష్ట్రం కోసమో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని ఏర్పాటు చేయలేదు. మహోజ్వల భారతదేశ నిర్మాణం కోసం బీఆర్‌ఎస్ ఏర్పాటైంది. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది.
బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను సృష్టిస్తాం’’ అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఐఆర్‌ఎస్ మాజీ అధికారి చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్ తదితరులు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్‌ఎస్‌కు రాజకీయం క్రీడ కాదు. ఒక టాస్క్. ఒక లక్ష్యం. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఏటా రూ.1.45 లక్షల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం. ఏటా రూ. 2.5 లక్షల కోట్లతో 25 లక్షల దళిత కుటుంబాలకు ‘దళిత బంధు’ అమలు చేస్తాం.
ప్రధాని మోదీ విధానం ప్రైవేటీకరణ అయితే.. మా విధానం జాతీయీకరణ. వారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసినా మేం అధికారంలోకి వస్తే వెనక్కి తీసుకుని జాతీయీకరణ చేస్తాం. లక్షల కోట్ల రూపాయల విలువౌన రైల్వే, విమాన, నౌకాశ్రయాలు, టెలిఫోన్ సంస్థలను మోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకు అమ్ముతోంది. మేం అధికారంలోకి వస్తే అవన్నీ వాపస్ తీసుకుని ప్రభుత్వ రంగంలో చేర్చుతాం.
అన్ని వనరులు ఉన్నా అభివృద్ధి లేదు..
స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ, అంబేద్కర్ తదితరుల మార్గదర్శకత్వంలో చక్కటి ప్రయాణం మొదలై దేశాన్ని ముందుకు నడిపే ప్రయత్నాలు సాగాయి. కానీ తర్వాతి కాలంలో రాజకీయాలు, ప్రజాజీవితంలో జరిగిన మార్పులతో దేశం గమ్యాన్ని చేరుకోలేదు. అమెరికా, చైనాతో పోలిస్తే దేశ విస్తీర్ణంలో సగానికిపైగా అంటే 40కోట్ల ఎకరాల సాగుయోగ్య భూమి, ఆపిల్స్ మొదలుకుని మామిడి పండ్లు దాకా పండే పర్యావరణ మండలాలు, 40వేల టీఎంసీల నీరు, పనిచేసే మానవ వనరులు అందుబాటులో ఉన్నా అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదు.
కేంద్ర విధానాలు సరిగా లేకపోవడం వల్లే 13 నెలల పాటు ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన చేశారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 4 లక్షల మెగావాట్లు ఉన్నా ఏనాడూ 2.10లక్షల మెగావాట్లకు వినియోగం మించడం లేదు. ఈ దుస్థితిని నివారించేందుకు ప్రజాజీవితంలో ఉన్న ప్రతివ్యక్తి ఆలోచించాలి. లక్ష్యశుద్ధి, సంకల్ప శుద్ధితో సాధించలేనిది ఏమీ ఉండదు. ఇది గతంలో అనేకసార్లు రుజువైంది.
రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా?
సువిశాల భారతదేశానికి సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా లక్షల అబద్ధాలు, కోట్లకొద్దీ డబ్బు కుమ్మరిస్తున్నారు. మత కల్లోలాలు రేపుతున్నారు. పదవులు రాగానే నేతలు నేల విడిచి సాము చేస్తూ అసహజంగా ప్రవర్తిస్తున్నారు.
రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా? మనం సింగపూర్, చైనా తరహాలో పురోగతి ఎందుకు సాధించలేకపోయాం? జింబాబ్వే, రష్యా, చైనా, అమెరికా తదితర దేశాల తరహాలో భారత్‌లో భారీ జలాశయాలు ఎందుకు లేవు? కేంద్ర ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకపోవడం, పార్టీలు ప్రజలను వంచించడం వల్లే ఈ దుస్థితి నెలకొంది.
ప్రజలు గెలవాల్సిన చోట పార్టీలు, నాయకులు గెలుస్తున్నందునే ప్రజల ఆకాంక్షలు కనుమరుగవుతున్నాయి. భారత్ బుద్ధూ దేశం కాదు.. బుద్ధిమంతుల దేశం. ప్రతి గుండెను చేరగలిగితే భారత్ స్పందిస్తుందని గతంలో జయప్రకాశ్ నారాయణ్ నిరూపించారు. ఉజ్వల భారత్ నిర్మాణం వైపు అందరినీ సిద్ధం చేయడమే బీఆర్‌ఎస్ లక్ష్యం.
బీఆర్‌ఎస్ ఒక ప్రాంతం, భాష, వ్యక్తికి పరిమితం కాదు. ఏ గొప్ప పని ప్రారంభించినా అవహేళనలు ఎదురవుతాయి. మొదట కొంచెం హేళన చేయడం ప్రారంభిస్తారు. తర్వాత మన మీద దాడి చేస్తారు. చివరికి మనకు విజయం చేకూరుతుంది. ఇదొక యజ్ఞం.. కష్టాలు, నష్టాలు వస్తాయి.
సంక్రాంతి తర్వాత దూకుడే..
భవిష్యత్తులో పార్టీ కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. బీఆర్‌ఎస్‌లో చేరేవారికి స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో గుర్తింపు దక్కుతుంది. దేశవ్యాప్తంగా 6.64 లక్షల గ్రామాల్లో బీఆర్‌ఎస్ కమిటీల ఏర్పాటుతో కార్యాచరణ మొదలవుతుంది. 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడుగుపెడతాం. విద్యార్థి, మహిళా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం.
ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, ఒడిషా వంటి ఏడెనిమిది రాష్ట్రాల్లో సంక్రాంతి తర్వాత బీఆర్‌ఎస్ కార్యక్రమాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. తూర్పు కనుమల నుంచి పశ్చిమ కనుమల వరకు పార్టీని విస్తరిస్తాం. ప్రజల సమస్యలే ఇతివృత్తం, పరిష్కారమే బీఆర్‌ఎస్ లక్ష్యం.
ఏపీ ప్రజలూ కలిసిరావాలి
భారత్‌ను ఉజ్వలంగా తయారుచేసే మహాయజ్ఞంలో ఏపీ ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. బీఆర్‌ఎస్‌లో చేరిక కోసం తట్టుకోలేనంత ఒత్తిడి వస్తోంది. త్వరలోనే ఆశ్చర్యపరిచే రీతిలో చేరికలు ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారు. మీరు సిట్టింగ్ కదా అని అడిగితే.. తాము అక్కడ ఫిట్టింగ్‌గా లేమని అంటున్నారు..’’ అని కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏపీకి చెందిన తాడివాక రమేశ్‌నాయుడు (కాపునాడు జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్‌నాయుడు (కాపునాడు ప్రధాన కార్యదర్శి), రామారావు (ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు), భారతి (మంగళగిరి) తదితరులకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్
బీఆర్‌ఎస్ ఏపీశాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్టు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగిన మాజీ మంత్రి రావెల కిషోర్‌సేవలను జాతీయస్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. ‘‘ఇవాళ మాకు మంచి వజ్రాలు దొరికాయి. తోట చంద్రశేఖర్ పనితీరుపై సంపూర్ణ విశ్వాసంతో పాటు విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. అధికారిగా అనుభవమున్న ఆయనకు అవకాశం కలిగింది. ఇక తడాఖా చూపడమే తరువాయి’’ అని కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment