మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి వదిలి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, తదితరులు
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు ఎత్తిపోసిన గోదావరి నీళ్లను.. హల్దీవాగు, మంజీరా నది ద్వారా నిజాంసాగర్‌కు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే నీటిని సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దివాగుకు పైన ఉన్న బంధం చెరువులోకి విడుదల చేశారు. ఈ నీళ్లు పెద్దచెరువు, శాకారం ధర్మాయి చెరువు, కానీ చెరువులను నింపుతూ.. హల్దీవాగులోకి, అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌కు చేరనున్నాయి.
గజ్వేల్‌కు నీళ్లిచ్చే ప్రాజెక్టుకూ..
అవుసులోనిపల్లి నుంచి బయలుదేరిన సీఎం.. మర్కూక్ మండలం పాములపర్తి సమీపంలో కాల్వ ద్వారా గజ్వేల్ ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు, మహిళలు గోదావరి జలాల్లో పసుపు, కుంకుమ, పూలు, నాణేలు వేసి గోదారమ్మకు స్వాగతం పలికారు. ఇక్కడ విడుదల చేసిన నీటితో పాములపర్తి చెరువు, పాతూరు, చేబర్తి, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా మొదలైన 20 చెరువులు నిండుతాయి.
అవుసులోనిపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు
గ్రామాల్లో పండుగ వాతావరణం
గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో పండుగ వాతా వరణం నెలకొంది. ఉదయం నుంచే వర్గల్, గజ్వేల్, మర్కుక్ మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్దఎత్తున అవుసులోనిపల్లికి, పాములపర్తికి చేరుకున్నారు. తమ వెంట పసుపు, కుంకుమలు, పూలు, నాణేలు తీసుకొచ్చారు. సీఎం నీటిని విడుదల చేయగానే.. పెద్ద ఎత్తున జైతెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. గోదావరి నీళ్లలో పసుపుకుంకుమలు, పూలు చల్లారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్‌గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గోదావరి జలాలను విడుదల చేస్తున్న కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్, ఈఎన్సీ హరిరామ్
వీలైనంతగా నీళ్లివ్వాలనే లక్ష్యంతో..
‘నేను కాపోన్ని నాకు రైతుల కష్టాలు తెలుసు’అని తరచూ చెప్పే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ వరకే పరిమితం చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అందేలా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దానికితోడు యాసంగి పంటలు వేసిన రైతులు హల్దివాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే అటు హల్దివాగుకు, ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. అధికారులు కూడా వెంటనే పనుల వేగం పెంచి నీటి విడుదలకు కాల్వలు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేశారు. సీఎం మంగళవారం ఈ రెండు చోట్లా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హల్దివాగులోకి ఎన్నిరోజులకు నీరు చేరుతాయి. ఎన్ని చెక్‌డ్యామ్‌లు, ఎన్ని చెరువులు నిండుతాయి, భూగర్భ జలాల పరిస్థితి ఏమిటని మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ హరేరామ్‌లను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment