CM KCR Will Continuously Review The Situation Of Rains And Floods In Telangana - Sakshi
Sakshi News home page

ప్రాణ నష్టం జరగొద్దు..

Published Fri, Jul 28 2023 3:41 AM | Last Updated on Fri, Jul 28 2023 10:37 AM

KCR will continuously review the situation of rains and floods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు, ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వరద పరిస్థితులపై గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఆయన ప్రగతిభవన్‌ నుంచి సమీక్షించారు. మంత్రులతో ఎప్పటి కప్పుడు ఫోన్లో మాట్లాడారు.

ఎక్కడైనా ప్రమా దాలు జరిగితే వెంటనే మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధి కార యంత్రాంగం రేయింబవళ్ళు క్షేత్ర స్థాయిలో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్‌కు ఆదేశాలు..
పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు తీసుకోవా ల్సిన చర్యలను సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె సచివాల యం నుంచి వరద పరిస్థితులను సమీక్షిస్తు న్నారు. ముంపు ప్రాంతాలకు హెలికాప్టర్లు, ఆహారం, వైద్యం, రక్షణ సామగ్రి పంపించారు.

పోలీసు యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని డీజీపీ అంజనీ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు డీజీపీ రాష్ట్ర స్థాయి వరద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
 
ఇన్‌ఫ్లోలు ముందుగా అంచనా వేయాలి    
గోదావరి, ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని ఇరిగే షన్‌ అధికారులను సీఎం ఫోన్‌ ద్వారా ఆదేశించారు. ప్రాజెక్టుల సీఈలకు స్వయంగా ఫోన్‌ చేసి పరిస్థితులను ఆరా తీశారు. 

క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా
మంత్రులతో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఆరా తీస్తూ సూచనలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫోన్‌ చేసి గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మోరంచపల్లిలో ప్రజలను రక్షించే చర్యలను సమీక్షించారు.

సీఎం ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్‌ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, గంగుల కమలాకర్‌ తమ తమ జిల్లాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement