సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు అర్థరాత్రి చివరి పూజ అనంతరం నిమజ్జనానికి సిద్ధమయ్యారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అటు.. రేపు జరగబోయే శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఉత్సవ సమితి చేసింది.
ఖైరతాబాద్ వినాయకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తొమ్మిది రోజులుగా పూజలు నిర్వహించిన ఉత్సవ సమితి నేడు అర్ధరాత్రి ఇక చివరి పూజను నిర్వహించనుంది. అర్ధరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని ఉత్సవ సమితీ కదిలించనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
శోభాయాత్ర సాగుతుంది ఇలా..
►ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ
►అర్దరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని కదిలించనున్న ఉత్సవ కమిటీ
►రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు విగ్రహాలను భారీ టస్కర్ లోకి ఎక్కించనున్న కమిటీ
►ఉదయం 4 నుంచి 7 వరకు మహాగణపతిని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ వర్క్
►ఉదయం ఎనిమిది గంటల లోపు ప్రారంభం కానున్న మహా గణపతి శోభాయాత్ర
►టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనున్న మహా గణపతి
►ఉదయం 10 గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్ద కు చేరుకునే అవకాశం
►తర్వాత భారీ వాహనంపై మహాగణపతి తొలగింపు కార్యక్రమం
►క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఉదయం 11 నుంచి 12 గంటల లోపు పూజా కార్యక్రమం
►12 నుంచి హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం షురూ
►మ. 2 గంటల లోపు మహా గణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు
నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..
మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. నిమజ్జనానికి తరలివచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది.
నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి.
ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
Comments
Please login to add a commentAdd a comment