బాలుడిని తల్లికి అప్పగిస్తున్న డీఎస్పీ
కామారెడ్డి క్రైం: భిక్కనూరులో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, బాలుడ్ని తల్లి ఒడికి చేర్చారు. కేసు వివరాలను ఎస్పీ శ్వేత మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్టు పక్కన గుడారం వేసుకుని మూలికలు అమ్మే వారు కొద్ది రోజులుగా ఉంటున్నారు. గత నెల 30న గుడారంలో అందరూ నిద్రిస్తుండగా, రెండున్నర నెలల వయస్సు గల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మరుసటి రోజు ఉదయం బాలుడి తల్లి పూజాబాయి భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కిడ్నాప్ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. సీఐ యాలాద్రి, ఎస్సై నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. బాలుడి ఆచూకీ గుర్తించడానికి కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ముఖ్యమైన అన్ని ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. భిక్కనూరు టోల్‌గేట్ వద్ద లభించిన ఫుటేజీ ఆధారంగా ఒక ఆటోను గుర్తించి అనుమానించారు. మంగళవారం జాతీయ రహదారిపై నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సదరు ఆటోను పోలీసులు పట్టుకున్నారు. ఆటోలోని ఇద్దరు వ్యక్తులను విచారించగా, తామే బాలుడ్ని ఎత్తుకెళ్లినట్లు అంగీకరించారు.
బాలుడి అప్పగింత..
ఇద్దరు నిందితులను విచారించగా సంగారెడ్డిలోని వడ్డెర పద్మ అనే మరో నేరస్తురాలి ఇంటి వద్ద బాలుడ్ని దాడి ఉంచినట్లు తెలిపారు. దీంతో వారిద్దరిని వెంట తీసుకుని వెళ్లి బాలుడ్ని, ఈ ముఠాలో సభ్యులైన మరో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి కామారెడ్డికి తీసుకొచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బాలుడిని తల్లికి అప్పగించారు.
ముఠాగా ఏర్పడి కిడ్నాప్‌లు
సంగారెడ్డిలోని నేతాజీనగర్‌కు చెందిన వడ్డెర పద్మ, పఠాన్‌చెరులో నివాసం ఉంటున్న రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన కూడలి రవళి, సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన ఉందడి నవీన్, సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన మామిడాల వెంకటేశ్ ముఠా ఏర్పడి చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి వెట్టిచాకిరి, భిక్షాటన చేయించడం లేదా ఎవరికైనా అమ్ముకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రోడ్డు పక్కన ఉంటున్న మూలికలు అమ్ముకునే వారి పిల్లలను ఎత్తుకెళ్తే ఎవరికీ చెప్పరనే ఉద్దేశ్యంతో ఆటోలో వచ్చి బాలుడ్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో రవళి గతంలో మాచారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితురా లు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహించాయని, సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ లక్ష్మీనారాయ ణ, భిక్కనూరు సీఐ యాలాద్రి, ఎస్సైలు నవీన్ కుమార్, సతీష్‌కుమార్, మహేందర్, సీసీఎస్ సీఐ అభిలాష్, ఎస్సైలు శేఖర్, కృష్ణ, భూమయ్యను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment