సాక్షి, తిరుమల: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ తప్పదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు.
కాగా, కోమటిరెడ్డి తిరమల పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం, ఆలయం వెలుపల కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడు ఉప ఎన్నికలతో బీఆర్‌ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉందని గులాబీ నేతలకు తెలిసొచ్చింది. టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికే బీఆర్‌ఎస్‌గా పేరు మార్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నేను యుద్ధం చేశాను. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఉప ఎన్నికల సమయంలో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా జీవితంలో నేను ఎప్పుడూ డబ్బుకి లొంగలేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డికి దమ్ముంటే నేను ఎక్కడ అవినీతి చేశానో నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఇదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయం. అవినీతి సొమ్ముతో కవిత ఢిల్లీలో 600 మద్యం షాపులు పెట్టారు’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment