సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని లోక్‌సభలో బీజేపీ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్టు కట్టడం కంటే ముందు ఎస్టీపీల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని సూచించారు. జంట జలాశయాలకు సంబంధించి ఇప్పుడు 111 జీవో అమలులో ఉందా? లేక 69 జీవో అమలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు.
శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎంను కలిసిన సందర్భంగా 111 జీవోపై నివేదిక ఇస్తానని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు ప్రస్తావించలేదన్న విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇచ్చామంటున్న విపక్షాలు, తెలంగాణకు గత ఆరు నెలల్లో రూ. 40 వేల కోట్లు ఇప్పటికే ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రస్తావించారన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింలకు వ్యతిరేమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వచ్చే పార్లమెంటు సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందుతుందని, దీని వల్ల ముస్లింలకు లాభం జరుగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ. 9,400 కోట్ల సర్వశిక్షా అభియాన్ నిధులు మురిగిపోయాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment