సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేనోళ్లు.. అసలు పనిచేయని వాళ్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గౌరవం లేకుండా ఎగిరి పడుతున్నరు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎంలను ఉరికించిన చరిత్ర మా విద్యార్థి సైన్యానికి ఉంది. కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న బఫూన్ గాళ్లు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నోరు వాడాల్సి వస్తే అందరి కంటే ఎక్కువ సత్తా కేసీఆర్‌కు ఉంది. ఉద్యమ సమయంలో ఎవరిని ఎలా చీల్చి చెండాడారో అందరికీ తెలుసు. మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. గోడకు వేలాడుతున్న తుపాకీ కూడా మౌనంగానే ఉం టుంది. దాన్ని వాడటం మొదలుపెడితే దిమ్మతిరిగే సమాధానం వస్తుంది. విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటుంటే.. బీజేపీ నాయకులు మాత్రం వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు నేర్చుకుంటున్నారు’’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌లో కొన్ని స్థానాలు గెలిచిన బీజేపీ ఆగడం లేదు. గతంలో పైశాచిక ఆనందం కోసం మాట్లాడినోడు ఓటుకు కోట్లు కేసులో ఎగిరి పోయిండు. మీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నయి. కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. దూషణలకు పాల్పడుతున్న వారికి మిత్తితో సహా బదులిస్తం. అవసరమొచ్చినప్పుడు బఫూన్ల భరతం పడతం’’ అని మండిపడ్డారు. బాత్ కరోడోమే.. కామ్ పకోడోంకీ దేశం కోసం.. ధర్మం కోసం అటూ నినాదాలు చేసే బీజేపీ నేతలకు తెలంగాణ భారతదేశంలో ఉందనే విషయం తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అభివృద్ధి గురించి తాము గణాంకాలతో సహా మాట్లాడితే మోదీ ప్రభుత్వం మాత్రం అరచేతిలో వైకుంఠం చూపుతోందని విమర్శించారు. ‘‘మోదీ బాత్ కరోడోమే.. కామ్ పకోడోంకీ (మాటలు కోట్లలో.. చేతలు పకోడీల్లా) అన్నట్టుగా ఉన్నయి. మేం ఉద్యోగాల గురించి మాట్లాడితే మోదీ పకోడీ గురించి మాట్లాడుతరు. రాష్ట్రానికి ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్రం మొండి చెయ్యి చూపింది. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని మూసేస్తున్న బీజేపీ.. ఇక బయ్యారంలో ఉక్కు కర్మాగారం కడ్తుందా’’ అని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో విద్యా ఉద్యోగ అవకాశాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. న్యాయవాదులు, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటాయించామని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి యువత తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇరవై ఏండ్ల క్రితం 45 ఏండ్ల వయసులో కేసీఆర్ గులాబీ జెండాను ఎగరవేసి రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న పార్టీలను ఎదిరించి తెలంగాణ సాధించారని కేటీఆర్ గుర్తు చేశారు. పదవులను గడ్డిపోచలా వదిలేసిన కేసీఆర్ త్యాగాలు ఈ తరం పిల్లలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణకు భరోసా కేసీఆర్.. భవిష్యత్తు కేటీఆర్: బాల్క సుమన్
రాష్ట్రానికి కేసీఆర్ భరోసా అయితే కేటీఆర్ భవిష్యత్తు అని, ఉద్యమంలో విద్యార్థుల పాత్రను దృష్టిలో పెట్టుకుని.. తమ లాంటి వారికి కేసీఆర్ అవకాశాలు ఇచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఎవరి సేవలు ఎలా వాడుకోవాలో కేసీఆర్‌కు తెలుసని, రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్‌వీ కేసీఆర్ వెంట నడవాలని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పని అయిపోయిందంటూ విమర్శలు చేస్తున్న వారికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌వి అభివృద్ది రాజకీయాలు అయితే బీజేపీది బట్టేబాజ్ రాజకీయమని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాలపై కేటీఆర్ ఇచ్చిన గణాంకాలను ప్రజలకు వివరించాలని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు టీఆర్‌ఎస్ రాజకీయ అవకాశాలు ఇచ్చిందని, రాష్ట్రంలో మరో 30 ఏండ్లు టీఆర్‌ఎస్ పాలన కొనసాగాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మా మౌనం.. గోడకున్న తుపాకీ
Published Sun, Mar 7 2021 1:41 AM | Last Updated on Sun, Mar 7 2021 10:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment