శనివారం ‘ఇండియా ఎట్ 75’ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోకి పెట్టుబడులు రప్పించేందుకు సానుకూల విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల ఎలక్ట్రానిక్ వాహన పాలసీని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో శనివారం ‘ఇండియా ఎట్ 75’ సదస్సులో ‘స్థానిక, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, ఆవిష్కరణలు, పెట్టుబడుల మేళవింపు– భారత్‌లో సాంకేతిక పునరుద్ధరణ’అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. కోవిడ్ మహ మ్మారి సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంటి నుంచి పనిచేయడం, డిజిటల్ సొల్యూషన్ తదితరాలను ఆచరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
సాంకేతిక రంగంలో భారత్ ప్రముఖ పాత్ర
భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక సాంకేతిక మానవ వనరులు ఉండటంతో రెండు దశాబ్దాలుగా ప్రముఖపాత్ర పోషిస్తోందని కేటీఆర్ అన్నారు. సాంకేతికంగా మన స్థానాన్ని పటిష్టం చేసేందుకు కోవిడ్ సంక్షోభం సరైన వేదికగా పనిచేస్తుందన్నారు. 28.6 ఏళ్ల సగటు ఆయుర్దాయువు ఉన్న మానవ వనరుల్లో భారత్‌లో ఎక్కువగా ఉండటం అనుకూలించే అంశమని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సమగ్రాభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్తూ వ్యవసాయం, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ రిటైల్, రోబో డెలివరీ రంగాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.
5జీ సాంకేతికత భారత్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతోపాటు టెక్నాలజీ రంగంలో భారత్ నాయకత్వ స్థాయికి ఎదిగేందుకు దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు(ఏఐ), బ్లాక్ చెయిన్, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారంగా తెలంగాణ అనేక ప్రాజెక్టులు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించా రు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment