సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణ పురపాలక శాఖకు రావాల్సిన రూ.2,537 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో కలసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర పురపాలక శాఖకు సంబంధించి పలు విషయాలను కేంద్ర మంత్రితో చర్చించాం. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి, కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చిన తీరును వివరించాం. అక్టోబర్‌లో మొత్తం నివేదికతో రావాలని మంత్రి తమకు సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.217 కోట్లు, అమృత్ స్కీమ్ కింద రూ.351.77 కోట్లు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు రూ.783 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. తెలంగాణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పట్టణ ప్రాంత డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి రూ.1,184 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మున్సిపల్ శాఖకు రూ.2,537.81 కోట్ల నిధులు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని కోరాం. వీటిపై సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి తగిన ఆదేశాలు ఇచ్చారు’అని కేటీఆర్ వెల్లడించారు.
మామునూరుకు కేంద్ర బృందం..
సాధ్యమైనంత త్వరగా వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరామని కేటీఆర్ వెల్లడించారు. ఉడాన్ స్కీమ్‌లో వరంగల్‌ను చేర్చాలని విజ్ఞప్తి చేశామని, తప్పకుండా చేరుస్తామని, పది రోజుల్లో కేంద్ర బృందాన్ని పంపుతామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ‘తెలంగాణలో మొత్తం ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సర్వే జరపనుంది. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించి గతంలో మార్చి 3న ఒక సమావేశం జరిగింది. కరోనా రావడంతో ఏఏఐ చేయాల్సిన సర్వే, ఉడాన్‌లో చేర్చాల్సిన అంశం పెండింగ్‌లో పడిపోయింది. ఆ పనులను వేగవంతం చేయాలని కోరాం’అని కేటీఆర్ పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేయండి..: వినోద్ కుమార్
కరీంనగర్‌లో స్మార్ట్ సిటీ మిషన్ అమలుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలోని 9 ప్రాజెక్టులకు సంబంధించి రూ.330 కోట్ల పనులు అమల్లో ఉన్నాయని, రూ.206 కోట్ల విలువైన 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ మొదటి దశ కోసం రూ.196 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, అందులో రూ.78 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మిగిలిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment