
మణికొండ: రాష్ట్రంలో రెండు విడతలుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కోటి మందికి పరీక్షలు చేశామని చెప్పారు. కంటి అద్దాలు అవసరమైన వారికి మేడిన్ తెలంగాణ అద్దాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. శుక్రవారం మణికొండలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శంకర సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, జిల్లాకో మెడికల్ కళాశాల, పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిందన్నారు. ఎక్కడా లేని విధంగా ఇటీవల నీతి అయోగ్ ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలోనే వైద్య ప్రమాణాలలో రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచిందని చెప్పారు.
ప్రపంచ స్థాయి ఆసుపత్రి రావటం శుభపరిణామం
హైదరాబాద్‌కు మరో ప్రపంచ స్థాయి కంటి వైద్య సేవలను అందించే శంకర ఆసుపత్రి రావటం శుభ పరిణామని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. సమాజానికి శంకర కంటి ఆసుపత్రి అందిస్తున్న సేవలు అమోఘమని, ఆర్థికంగా లేని వారికి ఉచితంగా, సంపన్నులకు నామమాత్రపు రుసుములతో సేవలు అందించటం అభినందనీయమన్నారు.
కంటివెలుగులో భాగంగా శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఈ ఆసుపత్రి తోడ్పాటునివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కోరిక మేరకు ముందుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచే సేవలను ప్రారంభించాలన్నారు. శంకర ఆసుపత్రి వాహనాలను ఎలాంటి ట్యాక్స్‌లు లేకుండా మినహాయింపులు ఇస్తామని హామీనిచ్చారు.
అంధత్వాన్ని తొలగించటమే లక్ష్యంగా..
దేశంలో అంధత్వాన్ని తొలగించటమే లక్ష్యంగా శంకర ఐ ఫౌండేషన్ ప్రారంభించామని, అదే మార్గంలో నిరంతరాయంగా కృషి చేస్తామని ఎస్‌ఈఎఫ్ యూఎస్‌ఏ వ్యవస్థాపకుడు మురళీ కృష్ణమూర్తి చెప్పారు. 2030నాటికి 5లక్షల మందికి ఉచిత శస్త్ర చికిత్సలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా 225 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి ఆసుపత్రి నిర్మాణానికి శంకర ఐ ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్ ఐకేర్‌లు దాతలుగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, సంస్థ ప్రతినిధులు ఎస్‌వీ బాల సుబ్రమణ్యం, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment