అవకాశాలు అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్‌ | KTR Participates In WE Hub Graduation Ceremony Hyderabad | Sakshi
Sakshi News home page

అవకాశాలు అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్‌

Jul 29 2021 2:28 AM | Updated on Jul 29 2021 7:26 AM

KTR Participates In WE Hub Graduation Ceremony Hyderabad - Sakshi

సదస్సులో నూతన ఆవిష్కరణలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశ జనాభాలో 50 శాతం మంది యువత 27 ఏళ్లలోపు వారే ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘వి హబ్‌’గ్రాడ్యుయేషన్‌ వేడుకలో మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘వి హబ్‌’ స్టార్టప్‌లు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు కృషి చేస్తున్నాయని చెప్పారు. స్టార్టప్‌ల ఉత్పత్తులు ఉపయోగకరమని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వమే తొలి వినియోగదారుగా మారి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఉత్పత్తులు అవసరమైన వారితో ‘వి హబ్‌’స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు అవసరమైతే ప్రభుత్వమే చొరవ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, వి హబ్‌ సీఈఓ దీప్తి రావుల పాల్గొన్నారు. 

‘వి హబ్‌’లో మూడు కొత్త కార్యక్రమాలు 
‘వి హబ్‌’ప్రారంభిస్తున్న మూడు కొత్త కార్యక్రమాలను కేటీఆర్‌ ప్రారంభించారు. వంద మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ‘ఫిక్కి ఫ్లో’సాయంతో అవసరమైన మద్దతు, దేశవ్యాప్తంగా 20 స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తుం ది. డేటా సైన్స్, కృత్రిమ మేథస్సు సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళలను తయారు చేసేందుకు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలోని వుమెన్‌ ఇన్‌ డేటా సైన్స్‌ (విడ్స్‌) భాగస్వామ్యంతో దేశంలోని ఐదు నగరాల్లో వంద మంది పాఠశాల విద్యార్థుల కోసం ‘గరల్స్‌ ఇన్‌ స్టెమ్‌’కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను చేపట్టేలా 50 మంది విద్యార్థినులకు రాçష్ట్రంలోని 5 సాంకేతిక విద్యాసంస్థల ద్వారా సాయమందించేందుకు ‘వి ఆల్ఫా’అనే మరో కార్యక్రమానికి వి హబ్‌ శ్రీకారం చుట్టింది. 

సర్టిఫికెట్ల అందజేత 
వివిధ గ్రాడ్యుయేట్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నవారిని కేటీఆర్‌ అభినందించారు. స్టార్టప్‌లకు మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేటివ్, న్యాయ, మార్కెటింగ్‌ మద్దతుతోపాటు సాంకేతిక సాయం అందించేలా తమ ఉత్పత్తులను రూపొందించిన 25 స్టార్టప్‌లు ‘ఇంక్యుబేషన్‌ సెకండ్‌ కోహర్ట్‌ గ్రాడ్యుయేషన్‌’పూర్తి చేసుకున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌పై ఆసక్తి కలిగిన ఆరు ఔత్సాహిక స్టార్టప్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు. సైబర్‌ క్రైమ్, ట్రాఫిక్, రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల భద్రత తదితరాలకు సంబంధించి హైదరాబాద్‌ సిటీ పోలీసు సహకారంతో చేపట్టిన ఎర్లీప్రెన్యూర్‌ కార్యక్రమం కింద పరిష్కారాలు చూపిన 12 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.  

ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సిద్ధం 
సాక్షి, హైదరాబాద్‌: తైవాన్‌ భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న తైవాన్‌ ఆర్థిక, సాంస్కృతిక కమిటీ (టెక్క్‌), తైవాన్‌ విదేశీ వాణిజ్యాభివృద్ధి మండలి (తైత్ర), ఇన్వెస్ట్‌ ఇండియా సంయుక్త ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో బుధవారం భేటీ అయింది. రాష్ట్రంలోని వ్యాపార అనుకూలతలు, మౌలిక వసతుల నేపథ్యంలో అనేక దేశాలు భారీ పెట్టుబడులతో వస్తున్న విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ పారిశ్రామిక పెట్టుబడులకూ తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తైవాన్‌ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు గతంలో తాను తైవాన్‌లో పర్యటించిన విషయాన్ని టెక్క్‌ డైరెక్టర్‌ జనరల్‌ బెన్‌వాంగ్‌కు కేటీఆర్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement