మా ఓపిక నశిస్తే.. బయట తిరగలేరు: కేటీఆర్‌ | KTR Strong Counter To BJP Over Attack On MLA Challa House | Sakshi
Sakshi News home page

మా ఓపిక నశిస్తే.. బయట తిరగలేరు: కేటీఆర్‌

Published Mon, Feb 1 2021 1:07 AM | Last Updated on Mon, Feb 1 2021 1:13 AM

KTR Strong Counter To BJP Over Attack On MLA Challa House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘టీఆర్‌ఎస్‌ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. చదవండి: (ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడి.. అట్టుడికిన వరంగల్‌)

‘మా ఓపికకూ ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించినం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నం. టీఆర్‌ఎస్‌ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దు’అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపై భౌతిక దాడులకు పాల్పడుతున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరముందని తెలిపారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు పాల్పడిందని గుర్తు చేశారు.

రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శల పరిధిని దాటి, బీజేపీ పదేపదే భౌతిక దాడులకు పాల్పడుతుండటం రాష్ట్ర రాజకీయాలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్‌ఎస్‌ కోరుకుంటోందని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు గమనించి, బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement