సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత మీడియా, ఎంటర్‌టైన్మెంట్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. నగరంలో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్(ఐడీసీ)ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం న్యూయార్క్‌లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థను సందర్శించి సంస్థ ఫైనాన్స్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షురాలు అలెగ్జాండ్రా కార్టర్‌తో సమావేశమయ్యారు. మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాభివృద్ధి, ఆవిష్కరణల విషయంలో ఇరువర్గాలు ఒకే విధమైన ఆశయాలను కలిగి ఉన్నట్టు ఈ చర్చల సందర్భంగా అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రంగాల ఉజ్వల భవిష్యత్‌కి కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
గొడుగు కింద ప్రఖ్యాత వినోద ఛానళ్లు..
వైవిధ్యభరిత కంటెంట్, బ్రాండ్స్, ఫ్రాంచైజీల ద్వారా టెలివిజన్, సినిమా, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి రంగాల్లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రపంచ ఖ్యాతి గడించింది. సంస్థ గొడుగు కింద ప్రపంచ ప్రఖ్యాత హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్, సీఎన్‌ఎన్, టీఎల్‌సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, ఈరోస్పోర్ట్, అనిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, నిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటి ఎంటర్‌టైన్మెంట్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. హైదారాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారతీయ మార్కెట్‌లోని అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు నగర మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాలపై తనదైన ముద్ర వేయాలని వార్నర్ బద్రర్స్ డిస్కవరీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
చదవండి: 105 సీట్లు మనవే! చెప్పినట్టు పనిచేస్తే గెలుస‍్తం.. లేదంటే మునుగుతం
వ్యూహాత్మక కేంద్రంగా సేవలు..
మన దేశంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని ఐడీసీ వ్యూహాత్మక కేంద్రంగా సేవలందించనుంది. తొలి ఏడాది 1200 వృత్తి నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించనుంది. వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచుకోనుంది. స్థానిక నిపుణులను ప్రోత్సహించడం, హైదరాబాద్ నగరంలో మీడియా, వినోద రంగ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాడు అందించడంలో సంస్థ చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టులపై ప్రసంగించనున్న కేటీఆర్
కాగా, వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న మంత్రి కె.తారకరామారావుకు అక్కడి ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. ఈనెల 21 నుంచి 25 వరకు నెవాడాలోని హెండర్సన్‌లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్(ఏఎస్‌సీఈ) ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సుకు కేటీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ పరివర్తనాత్మక ప్రాజెక్టులు – కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టుల గురించి సదస్సులో ప్రసంగించనున్నారు. వివిధ వాణిజ్య సమావేశాల్లోనూ కేటీఆర్ పాల్గొననున్నారు.
Thrilled to announce the grand entry of global media powerhouse "Warner Bros. Discovery" into the entertainment realm of Telangana!
— KTR (@KTRBRS) May 17, 2023
Hyderabad is set to witness the launch of their incredible IDC, a hub of creativity and innovation, with a whopping 1200 employees in the first… pic.twitter.com/z5hAj5kBNs
Comments
Please login to add a commentAdd a comment