హైహై నాయికా  | Leadership qualities are high in women | Sakshi
Sakshi News home page

హైహై నాయికా 

Published Wed, Mar 8 2023 2:59 AM | Last Updated on Wed, Mar 8 2023 2:59 AM

Leadership qualities are high in women - Sakshi

నాయకత్వ లక్షణాల్లో ఎవరు గొప్ప.. మహిళలా.. పురుషులా? దీనిచుట్టూ జరిగిన అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో బయటపడింది ఏమంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే మెరుగ్గా ఉంటాయట!. అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ నివేదిక ప్రకారం ఒక మంచి నేతకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు నిజాయితీ, మేధాశక్తి, కరుణతోపాటు సృజనాత్మకత. ఈ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే ఉంటాయని ఈ సంస్థ పరిశోధనాత్మక వ్యాసంలో పేర్కొంది.

ఇతరులు చెప్పేది వినడం, తనతోపాటు అందరి అభివృద్ధికి సాయం చేయడం, ఎలాంటి పరిస్థితులనైనా సృజనాత్మకతతో ఎదుర్కోవడం వంటి నాయకత్వ లక్షణాలు మహిళల్లో అధికంగా ఉంటాయని అమెరికాకు చెందిన నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎలైస్‌ ఈగ్లొ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో స్త్రీ, పురుషులు దాదాపు ఒకేవిధమైన నిర్ణయాలు తీసుకున్నా అధిక ఒత్తిడిలో పురుషులు ప్రమాదంతో కూడిన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని, కానీ మహిళలు ఒత్తిడిలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటారని సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది.

అధిక ఒత్తిడికి లోనైనప్పుడు మనిషి  లో కార్టిసొల్‌ అనే హార్మోన్‌ అధికంగా విడుదల అవుతుంది. ఈ కార్టిసొల్‌ హార్మోన్‌ విడుదలైనప్పుడు అది మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కార్టిసొల్‌ స్థాయి పెరిగినా మహిళల మెదడు పురుషులకంటే సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైంది. 

మందకొడిగా నాయకత్వ హోదా.. 
ఒక మహిళ మంచి నాయకురాలిగా రాణించగలదని సామాజిక, శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు నాయకత్వ హోదాలోకి ఎదగడం అత్యంత మందకొడిగా సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాయకత్వ హోదా విషయంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి ఇంకో 130 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. 

ప్రస్తుత పరిస్థితి ఇదీ.. 
 గతేడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లోనే మహిళలు దేశాధ్యక్ష లేదా ప్రభుత్వ అధినేత్రి హోదాలో ఉ­న్నా­రు. అందులో భారత్‌ సహా 13 దేశా­ల్లో అధినేత్రిలుగానూ మరో 15 దేశాల్లో ప్రభుత్వ అధినేత్రిలుగా ఉన్నారు. 
అన్ని దేశాలు కలిపి మంత్రుల స్థానాల్లో 21 శాతమే మహిళలు ఉన్నారు. 14 దేశాల్లో మాత్రమే మంత్రివర్గాల్లో సగం లేదా ఆపైన అతివలు ఉన్నారు. 
 ప్రస్తుతానికి అన్ని దేశాల పార్లమెంటుల్లో కలిపి 26 శాతం మహిళా అభ్యర్థులు సభ్యులుగా ఉన్నారు. 1995 నాటికి ఇది 11 శాతమే ఉండేది. వీటిలో ఐదు దేశాల్లో సగానికిపైగా మహిళా పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రు­వాండాలో 61 శాతం, క్యూబాలో 53 శాతం, నికరగ్వాలో 51, మెక్సికోలో 50, యూఏఈలో 50 శాతం మంది మ­హి­­ళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. 
 మరో 27 దేశాల్లో మహిళా పార్లమెంటు సభ్యులు 40 శాతానికిపైగా ఉన్నారు. అందులో 15 యూరప్‌లో, 5 లాటిన్‌ అమెరికా దేశాల్లో, 5 ఆఫ్రికాలో, చెరొకటి ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో ఉన్నాయి. ఇందులో అధిక దేశాల్లో మహిళల కోసం పార్లమెంటు స్థా­నా­ల్ని రిజర్వు చేయడం వల్ల సాధ్యమైంది. 
 ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో పార్లమెంటులో 10 శాతం కన్నా తక్కువగా మహిళలు ఉన్నారు. అందులో మూడు దేశాల్లో ఒక్క మహిళ కూడా పార్లమెంటులో లేరు. అవి మైక్రోనేసియా, పపువా న్యూగినియా, వనౌతు దేశాలు. 
136 దేశాల సమాచారం క్రోడీకరిస్తే స్థానిక సంస్థలకు ఎన్నికైన మహిళల సంఖ్య 30 లక్షలుగా (34 శాతం) ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే భారత్‌లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కారణంగా మనదేశంలో మొత్తంగా మహిళా ప్రాతినిథ్యం 44 శాతానికి పెరిగింది. అదే ఫ్రాన్స్‌లో 40, బ్రిటన్‌లో 34, జర్మనీలో 27.5, చైనాలో 23, జపాన్‌లో 13 శాతంగా ఉంది. 
 భారత్‌లో మొత్తం 2.5 లక్షల పంచాయతీలు ఉండగా మొత్తం 32 లక్షల మంది వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి­లో 14.5 లక్షల మంది మహిళలే. అత్యధికంగా ఉత్తరాఖండ్‌లో మహిళా ప్రాతినిధ్యం 54.8 శాతం ఉండగా అత్యల్పంగా జమ్మూకశ్మీర్‌లో 32 శాతం ఉంది. 
 మహిళలు నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 భారత్‌లో మంచినీటి ప్రాజెక్టులు విషయంలో పురుషులు నేతృత్వం వహిస్తున్న పంచాయతీలకన్నా మహిళా నాయకత్వంలోని పంచాయతీల్లోనే 62 శాతం అధికంగా ఉన్నాయని తేలింది. 
♦ ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం 50 శాతం దాటిన దేశాలు రెండే ఉన్నాయి. మరో 20 దేశాల్లో 40 శాతంగా ఉంది. 

అధినాయికలు నామమాత్రమే.. 
ప్రపంచవ్యాప్తంగా 1960 నుంచి ఇప్పటివరకు 59 దేశాల్లో మహిళలు అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. మొత్తంగా 77 మంది మహిళలు ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1960లో సిరిమావో బండారునాయికే శ్రీలంక ప్రధానిగా ఎన్నికై ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి మహిళా నేతగా ఖ్యాతిగాంచారు. ఈ ఏడాది ప్రారంభం నాటికి 15 దేశాలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఇటలీ, హొండురస్‌లో తొలిసారి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్నాయి. నిరంతరాయంగా అత్యధిక కాలం దేశాధినేతగా కొనసాగిన కీర్తి జర్మనీకి చెందిన ఎంజెలా మెర్కెల్‌కు దక్కింది.

ఆమె జర్మనీ చాన్సలర్‌గా 16 ఏళ్ల 16 రోజులు ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన దామె యుజెనియా చార్లెస్‌ (14 ఏళ్ల 328 రోజులు), లైబిరియాకు చెందిన ఎలెన్‌ జాన్సన్‌ సిర్లీఫ్‌ (12 ఏళ్ల 6 రోజులు) ఉన్నారు. మధ్యలో అంతరాయం వచ్చినా మొత్తంగా అత్యధికకాలం ప్రభుత్వాధినేత్రి హోదాలో ఉన్న ఘనత ఇందిరాగాందీకి కూడా దక్కుతుంది. ఆమె భారత్‌ ప్రధానిగా మొత్తం 16 ఏళ్ల 15 రోజులు పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఏకంగా 19 ఏళ్లకుపైగా ప్రధాని పదవిని అలంకరించారు.  

దొడ్డ శ్రీనివాసరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement