సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించతలపెట్టిన కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణనకు చట్టబద్ధత కల్పించనుంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఆలోగా కుల గణన ముసాయిదా బిల్లును సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కుల గణన ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి అన్ని సామాజిక వర్గాల వారీ గణాంకాలను సేకరించనున్నారు.
పాలసీల రూపకల్పనలో కీలకం!
చివరిసారిగా 1931లో బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో కులాల వారీగా జనగణన నిర్వహించింది. ఇప్పటికీ నాటి లెక్కలనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వ పాలసీలకు రూపకల్పన, నిర్ణయాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రజల వివరాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కచ్చితమైన తాజా సమాచారం అందుబాటులో ఉంటే, వాటికి అనుగుణంగా ఉత్తమ విధానాల రూపకల్పన, నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల అమలుకు సైతం ఈ గణాంకాలు ఉపయోగపడతాయి.
బిహార్, కర్ణాటకల్లో కులగణన పూర్తి
బిహార్‌లో అక్కడి ప్రభుత్వం రెండు దఫాలుగా కులగణన సర్వే నిర్వహించి నాలుగు నెలల కింద ఫలితాలను ప్రకటించగా, ఆ రాష్ట్రంలో 63 శాతం బీసీలున్నట్టు తేలింది. గత ఏడాది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే’ పేరిట కులగణన నిర్వహించింది. కానీ ఫలితాలను ఇంకా ప్రకటించలేదు.
ఈ రెండు రాష్ట్రాల్లో కులగణన నిర్వహించేందుకు అవలంభించిన విధానాలు, పద్ధతులు అధ్యయనం చేయాలని, ఇందుకోసం ఆయా రాష్ట్రాలకు అధికారుల బృందాలను పంపించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఏపీలో సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన ప్రక్రియను ప్రారంభించింది.
700కిపైగా కులాలు, ఉప కులాలు
కులగణన సర్వే కోసం ఇతర రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మొబైల్ యాప్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని కులాల జాబితాను యాప్‌లో పొందుపరచనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని ఉప కులాల వివరాలను సైతం సేకరించనున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో దాదాపుగా 723 కులాలు, ఉపకులాల పేర్లను యాప్‌లో చేర్చి సర్వే నిర్వహిస్తుండగా, తెలంగాణలో సైతం అటూఇటూగా దాదాపు అదే సంఖ్యలో కులాలు, ఉప కులాలు ఉండే అవకాశం ఉంది.
కులం చెప్పడానికి ఇష్టపడని/కులాన్ని వదులుకున్న వ్యక్తుల కోసం ‘నో క్యాస్ట్’ అనే ఆప్షన్ సైతం ఇచ్చే అవకాశం ఉంది. కులగణన ప్రక్రియకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. సర్వేలో కులంతో పాటుగా వ్యక్తుల విద్యార్హతలు, వృత్తులతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం సైతం అడిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment