నిరసన తెలుపుతున్న బాధితురాలు శైలజ
సాక్షి,మునగాల(కోదాడ): ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఓ యువతి వేడుకుంటోంది. ప్రేమ పేరిట వంచించి ముఖం చాటేసిన ప్రేమికుడి ఇంటి ఎదుటే నిరసన చేపట్టింది. ఈ ఘటన మునగాల మండలం కొక్కిరేణిలో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రియురాలు, ప్రియుడి తల్లిదండ్రులు, గ్రామస్తుల సమాచారం మేరకు.. కొక్కిరేణి గ్రామానికి చెందిన గల్లా సుధాకర్–శ్రీలతల కుమారుడు వెంకటేష్, ఇదే గ్రామానికి చెందిన కామళ్ల ప్రసాద్–సైదమ్మల రెండో కుమార్తె శైలజ ప్రేమలో పడ్డారు.
మూడేళ్ల క్రితం వెంకటేశ్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు హైదరాబాద్ వెళ్లాడు. అదే ఏడాది శైలజ కూడా కంప్యూటర్‌లో శిక్షణ తీసుకునేందుకు రాజధానికి చేరుకుంది. ఇద్దరూ కలిసి అక్కడే ఏడాది పాటు ఓ అద్దె గదిలో సహజీవనం చేయగా శైలజ గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. శైలజ ఖమ్మం పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. పెళ్లికి ముందే బిడ్డను కన్న ఈ జంట బిడ్డను సాదుకునేందుకు వేరొకరికి ఇచ్చినట్లు సమాచారం.
పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
కాగా, శైలజ తనను పెళ్లి చేసుకోవాలని వెంకటేశ్‌ను ఒత్తిడి చేయడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా, వెంకటేష్ ప్లేటు ఫిరాయించి వివాహం చేసుకోనని తేల్చి చెప్పడంతో, శైలజ తల్లిదండ్రులు గ్రామంలోని పెద్ద మనుషులను ఆశ్రయించారు. ఆ సమయంలో వెంకటేశ్ తండ్రి సుధాకర్ కూతురు నిశ్చితార్ధం తర్వాత ఇద్దరికి వివాహం చేస్తానని ఒప్పుకున్నాడు. కానీ వెంకటేష్ వివాహానికి ససేమిరా అనడంతో చేసేది ఏమీ లేక శైలజ మంగళవారంనుంచి ప్రియుడి ఇంటి ఎదుట పోరాటం చేస్తోంది. దీంతో వెంకటేష్ తల్లిదండ్రులు ఇల్లు వదలి వేరే గ్రామం వెళ్లారు. తనకు న్యాయం చేయాలంటూ శైలజ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కాగా, తిరిగి వచ్చిన వెంకటేష్ కుటుంబసభ్యులు తనను బయటికి గెంటివేసే ప్రయత్నం చేసినట్లు శైలజ ఆరోపిస్తోంది.
న్యాయం కావాలి
ఐదేళ్లుగా ప్రేమించి నేడు వివాహం చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడు. పెద్ద మనుషుల సమక్షంలో వివాహానికి అంగీకరించి నేడు ఒప్పుకోకపోవడంతో పోరా టానికి పూనుకున్నా. నాకు పుట్టిన పాపను తీసుకువచ్చి ఇవ్వాలి. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు.
– శైలజ,ప్రియురాలు, కొక్కిరేణి
ప్రేమ వ్యవహారం తెలియదు
మా కుమారుడి ప్రేమ విషయం మాకు ఇంత వరకు తెలియదు. ఇల్లు వదలి వెళ్లినప్పడు మాత్రమే తెలిసింది. గ్రామపెద్దల సమక్షంలో వివాహం చేస్తానని ఒప్పుకున్న మాట వాస్తవమే. ప్రస్తుతం ఒప్పుకోకపోవడంలో మా ప్రమేయం లేదు. శైలజకు ఏ విధంగానైనా న్యాయం జరిగితే మాకు సంతోషమే. మాపై ఆరోపణలు చేయడం బాధాకరం
– గల్లా సుధాకర్, వెంకటేష్ తండ్రి
చదవండి: చెల్లెలికి చిత్రహింసలు.. అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని..
Comments
Please login to add a commentAdd a comment