శివరాత్రి సందర్భంగా సోమవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న వేయి స్తంభాల గుడి
సాక్షి, నెట్‌వర్క్: మహా శివరాత్రి ఉత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలన్నీ విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నిచోట్లా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణల్లో భక్తుల జాగరణకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వేములవాడలోని రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇక్కడ సోమవారం ఆరంభమైన మహాజాతర మంగళ, బుధవారాల్లోనూ కొనసాగనుంది. మరోపక్క మంగళవారం నాటి ఉత్సవాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అచ్చంపేటలోని ఉమామహేశ్వరాలయం శివపూజలకు సిద్ధమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ‘చెంచుల పండుగ’ పేరుతో నిర్వహించే శివరాత్రి వేడుకల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మంగళవారం పెద్దపట్నం పండుగ నిర్వహించనున్నారు. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధానాలయంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. వరంగల్ నగరంలోని చారిత్రక వేయిస్తంభాల గుడి (రుద్రేశ్వరస్వామి ఆలయం)లో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో క్యూలైన్లు ఏర్పాటుచేసి చలువ పందిళ్లు వేశారు.
గవర్నర్, సీఎం శివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహాశివుడు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రార్థించారు.
కాళేశ్వరం ప్రధాన ఆలయం
ఎములాడలో జాతర షురూ
వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మహాశివరాత్రి జాతర.. ఉదయం 3 గంటలకు స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభమైంది. 5 గంటలకు ప్రాతఃకాల పూజ, మధ్యాహ్నం 2.30కి రాజన్నకు మహానివేదన సమర్పించారు. రాజన్న జాతరకు ఈసారి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇక మంగళవారం మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఉదయం టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొననున్నారు. కాగా, రాజన్న దర్శనానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు గుడి ఆవరణతోపాటు చెరువులోని ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు నిలిపివేయడంతో షవర్ల వద్ద రద్దీ పెరిగింది. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దుచేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువు ఖాళీస్థలంలో శివార్చన పేరుతో 1,500 మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment