బహిష్కరణకు గురైన కుటుంబాలు ఉంటున్న ఇళ్ల దారికి అడ్డంగా రాళ్లు వేస్తున్న తండా మహిళలు
గూడూరు: మంత్రాల నెపంతో మూడు కుటుంబాలను తండా నుంచి బహిష్కరించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు మాజీ ఎంపీటీసీ జాటోతు గంగమ్మ, గుగులోతు పూల్‌సింగ్, వీరన్న తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజుల కిందట తండా మధ్యలో బొడ్రాయి ప్రతిష్టించాలని తండావాసులంతా నిర్ణయించారు. మరో రెండ్రోజుల్లో బొడ్రాయి ప్రతిష్టాపన ఉందనగా తండా వీధులన్నీ శుభ్రం చేసే పని మొదలు పెట్టారు.
దీంతో అందరూ నిర్ణయించిన చోట బొడ్రాయి ప్రతిష్టించకూడదని జాటోతు గంగమ్మ, గుగులోతు పూల్‌సింగ్, వీరన్న చెప్పారు. తమ మాటను వ్యతిరేకించారని తండావాసులంతా కలిసి ఆ మూడు కుటుంబాలు మంత్రాలు వేస్తున్నాయంటూ నిందించి, వారితో ఎవరూ మాట్లాడరాదంటూ, వారి ఇళ్లు ఉండే వీధికి ఎవరూ వెళ్లకూడదని, వారు తండాలోకి రాకూడదని నిర్ణయించి దారికి అడ్డుగా ముల్లకంప, రాళ్లు వేశారు. వారు ఉపయోగించే బోర్‌వెల్‌ను పాడుచేశారు. దీంతో బాధిత కుటుంబాలు రెండ్రోజుల కిందట గూడూరు పోలీసులను ఆశ్రయించాయి.
స్థానిక ఎస్సై సతీశ్‌గౌడ్ తండావాసులకు నచ్చచెప్పి వచ్చారు. అయినా తండావాసులు ఆ మూడు కుటుంబాలను కలుపుకోకుండా శనివారం బొడ్రాయి ప్రతిష్టాపన జరపాలని నిర్ణయించారు. దీంతో మానసికంగా మరింత కుంగిన బాధిత కుటుంబాలు శుక్రవారం గ్రామపంచాయతీ పెద్దలు, ఇతర తండా పెద్దలతో గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment