సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశంలో వెనుకబాటుతనం కనిపిస్తోందని రైతులు, పేదల ప్రగతి లక్ష్యంగా రైతు ప్రభుత్వం ఏర్పడాలని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అబ్ కీ బార్ సర్కార్ నినాదంతో రైతు ప్రభుత్వం ఏర్పాటు మినహా తమకు వేరే కోరికలేవీ లేవన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు.
పార్టీలో చేరిన నేతలకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు కలుపుకుని మొత్తం 65 సీట్లలో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తే కేంద్రం మెడలు వంచలేమా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి ఉండదని, ఈ రకంగా దేశానికి నేతృత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు దక్కుతుందన్నారు.
అంబానీ, ఆదానికి అప్పగించి..
దేశంలో నిల్వ ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో 150 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా ఆ్రస్టేలియా, ఇండోనేషియా నుంచి కొనుగోలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. అంబానీ, ఆదానీకి అప్పగించి విద్యుత్ బిల్లులు పెంచేందుకు కేంద్రం వింత చేష్టలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి 20వేల మంది స్వయంగా చూసివెళ్లారని చెప్పారు. దేశంలో నెలకొన్న సమస్యలను తొలగించడానికి కొత్త పార్టీ అవసరముందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే మహారాష్ట్రలో రెండు మూడేళ్లలో వెలుగు జిలుగులు వస్తాయన్నారు.
త్వరలో బుల్డానా జిల్లా నుంచి 100 శాతం మంది సర్పంచులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూస్తుంటే వందకు వంద శాతం మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీష్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన చైర్మన్ వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్ ఇంచార్జి వంశీధర్ రావు, బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సోలాపూర్ నేత నగేష్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు తోకముడిచి కోతలు ఎత్తేశారు
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ కాలు పెట్టడంతో తోక ముడిచి విద్యుత్ కోతలు ఎత్తేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్ అమలు చేయాలని సూచించిన కేంద్రేకర్ అనే ఐఎఎస్ అధికారిని సీఎం, మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని ఆరోపించారు. అక్కడ తెలంగాణ మోడల్ అమలుకు రూ.49వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని, సంపద కలిగిన ఆ రాష్ట్రంలో ఆదాయం ఏమవుతోందని ప్రశ్నించారు.
ఇప్పటివరకు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ సమస్యలను ఎందుకు దూరం చేయలేకపోయాయని నిలదీశారు. సాగునీరు లేక మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, మహారాష్ట్రలో ఇప్పటికే 70వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరో లక్ష మంది అదే బాటలో ఉన్నట్లుగా తనకు తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment