మియాపూర్ (హైదరాబాద్): పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును ప్లాట్ల కొనుగోలు కోసం చెల్లిస్తే.. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్‌ఎస్టేట్స్ సంస్థ వారిని నిండా ముంచింది. సుమారు 300 మంది నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసి.. వారికి ప్లాట్లు ఇవ్వకుండా, డబ్బులూ తిరిగివ్వకుండా బోర్డు తిప్పేసింది. దీనితో హైదరాబాద్‌లోని మియాపూర్ ఆల్విన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ముందు బాధితులు ఆదివారం ధర్నాకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలదాకా..
బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన జానీ బాషాషేక్ రామంతాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ.. మియాపూర్‌లో మైత్రి ప్రాజెక్టు రియల్ ఎస్టేట్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని గాగిలాపూర్‌లోని రాయల్ లీఫ్, రామేశ్వర్‌బండలోని రాయల్ ప్యారడైజ్, మామిడిపల్లిలో రాయల్ వింట్, హంబ్టాన్ ఫామ్స్ పేరుతో వెంచర్లు వేసి.. ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తున్నట్టు ప్రచారం చేశాడు.
తప్పుడు డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు చూపించి తక్కువ ధరకే ప్లాట్లను ఇస్తామంటూ ప్రజలను నమ్మించాడు. పలు ప్రాంతాలకు చెందిన 300 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షల నుండి రూ.30 లక్షల మేర కట్టించుకున్నాడు. కానీ రిజిస్ట్రేషన్స్ చేయకుండా బాధితులను మూడేళ్లుగా తిప్పించుకుంటూ వచ్చారు. చివరికి మకాం మార్చి సంస్థకు తాళం వేసి పారిపోయాడు.
నెల రోజుల కిందే ఫిర్యాదు చేసినా..
తమకు న్యాయం చేయాలని కోరుతూ మియాపూర్, పటాన్‌చెరువు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లలో నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మైత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేశామని వివరించారు. మైత్రిలో డబ్బులు కట్టినవారంతా పేద, మధ్య తరగతికి చెందినవారమేనని.. తమ కలలు కల్లలు అవుతున్నాయని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment